Current Shock | నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ తీగలు తగడంలో భార్యాభర్తలు ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ముగ్గురు పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
బోధన్ మండలం ఉట్పల్లి గ్రామానికి చెందిన దంపతులు రత్నావత్ సంజీవ్(45), జ్యోతి (41) బట్టలు ఉతికి ఆరేస్తుండగా బట్టలు ఆరవేసే తీగకు కరెంట్ వైర్లు తగిలి విద్యుత్ సరఫరా జరిగింది. దీంతో విద్యుదాఘాతానికి గురై వారిద్దరూ అక్కడే దుర్మరణం చెందారు. వారి ముగ్గురు పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కాగా, ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. భార్యాభర్తల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.