కమ్మర్పల్లి(మోర్తాడ్), నవంబర్ 17: నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలో పలు చెట్లను రీప్లాంటేషన్ చేయించారు. కమ్మర్‌పల్లిలో రూ.5కోట్లతో రోడ్డు విస్తరణ, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా రోడ్డుకిరువైపులా కొన్ని చెట్ల తొలగింపు అనివార్యమైంది. ఇందులోంచి పలు చెట్లను ఇజ్రాయిల్‌లో ఉంటున్న కమ్మర్‌పల్లికి చెందిన ఎన్ఆర్ఐ గుగ్గిలం దేవరాజ్ రీప్లాంటేషన్ చేయించేందుకు ముందుకొచ్చారు. సొంత ఖర్చుతో గురువారం రావి, మర్రి, వేప తదితర పది రకాల చెట్లను వేర్లతో సహా పెకిలించి తరలించారు.
వీటిలో ఐదు చెట్లను గ్రామశివారులోని బ్రహ్మంగారి గుట్ట దేవాలయాల క్షేత్రం వద్ద, మరో ఐదు చెట్లను మినీ స్టేడియం, శ్మశానవాటిక సమీపంలో రీప్లాంటేషన్ చేశారు. చెట్లకు పునర్జన్మనిచ్చిన ఎన్ఆర్ఐ దేవరాజ్‌ను, అతని మిత్రులను గ్రామస్తులు అభినందించారు.