ఇంటింటికీ తాగునీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడుగనని ధైర్యంగా చెప్పిన దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. సీఎం నాయకత్వంలో తెలంగాణ దేశానికే మార్గదర్శకంగా నిలిచిందన్నారు. బాల్కొండలో నిర్మించిన పోలీసుస్టేషన్‌ను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి ఆయన సోమవారం ప్రారంభించారు.
-బాల్కొండ, మార్చి6
బాల్కొండ, మార్చి 6 : ప్రతి ఇంటికీ తాగునీరు అందించకుంటే ఓటు అడగను అని ధైర్యంగా చెప్పిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ అని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సీఎం కేసీఆర్ విజన్ చాలా గొప్పదని, ఆయన మార్గదర్శనంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నంబర్‌వన్‌గా నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత పోలీసుల పనితీరు మెరుగుపడిందన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పోలీసుస్టేషన్‌ను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, డీజీపీ అంజనీకుమార్‌తో కలిసి ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హోం మంత్రి మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు పోలీసుస్టేషన్లలో గడిపానని, ఆ సమయంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తండ్రి వేముల సురేందర్‌రెడ్డితో కలిసి తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకత కోసం చర్చించే వాళ్లమని గుర్తు చేసుకున్నారు.
2014కి ముందు పోలీసుల సంక్షేమానికి పెద్దగా ఖర్చు పెట్టేవారు కాదని, స్వరాష్ట్రంలో రూ.9,598 కోట్లు వెచ్చించి పోలీసుస్టేషన్లను ఆధునీకరించామని, నూతన వాహనాలు అందించామన్నారు. పోలీసు శాఖలో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని చెప్పారు. ఠాణాలకు నిధులు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ మినహా దేశంలో ఎక్కడా లేదన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ ఇతర రాష్ర్టాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నదని చెప్పారు. ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణకు వచ్చే వారు ఇక్కడి అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. ఇక్కడి రైతులను లక్షాధికారులను చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాలు చరిత్రలో నిలిచి పోతాయన్నారు.
శాంతిభద్రతలకు నిలయంగా తెలంగాణ..
సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో తెలంగాణ రాష్ట్రం శాంతిభద్రతలకు నిలయంగా మారిందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి అకుంఠిత దీక్ష, మేధోమధనంతో తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. ఉద్యమకారుడిగా కొన్ని వందలసార్లు ఎన్నోసార్లు పోలీస్స్టేషన్లలో గడిపానని, కానీ దేశంలోని గొప్ప ప్రజాస్వామ్యం వల్ల మంత్రిగా ఠాణా ప్రారంభోత్సవానికి రావడం ఆనందంగా ఉందని చెప్పారు. గతంలో పోలీస్స్టేషన్లకు కనీసం స్టేషనరీకి కూడా నిధులు లేని పరిస్థితి ఉండేదని మంత్రి వేముల గుర్తు చేశారు. కానీ ప్రజల కోసం పని చేసే వ్యవస్థ అవసరాలు ఏంటో తెలిసిన సీఎం కేసీఆర్.. ప్రతినెలా పోలీస్స్టేషన్లకు నిధులు ఇస్తున్నారన్నారు. తెలంగాణ పోలీసులు దేశంలోనే నంబర్‌వన్‌గా నిలుస్తున్నారని, దేశ రక్షణ కోసం పని చేసే ఎన్నో అంశాలను హైదరాబాద్ పోలీసులు నిర్వర్తిస్తున్నారన్నారు.
ఉద్యమ సమయంలోనే తెలంగాణ ఏర్పాటు తర్వాత ముందున్న లక్ష్యాల గురించి చర్చించి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగామని, పరిశ్రమలు, పెట్టుబడులు ఇక్కడికి తీసుకవచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఎక్కడైనా పరిశ్రమలు రావలన్నా, ఐటీ సెక్టార్ అభివృద్ధి చెందాలన్నా శాంతిభద్రతలు బాగుండాలని చెప్పారు. ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తేనే పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయని, నిరంతర విద్యుత్, ఇన్ఫాస్ట్రక్చర్ ఉం డాలని, ఈ మూడు అంశాలపై మేధోమధనం చేసి సక్సెస్ అయ్యామన్నారు. సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్ష, ఆయన కష్టంతోనే తెలంగాణకు మేలు జరుగుతున్నదని, పంట పొలాలు పచ్చగా కళకళలాడుతున్నాయని మంత్రి వేముల అన్నారు. పెట్టుబడుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పల్లెప్రగతి కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. మహిళల సంక్షేమం కోసం ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే రూ.950 కోట్లు ఖర్చు చేశామన్నారు. డీజీపీ అంజనీకుమార్, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, సీపీ నాగరాజు, పోలీసు ఉన్నతాధికారులు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.