సుభాష్‌నగర్, జూలై 7 : దశాబ్ద కాలం క్రితం సందర్శకులతో కిటకిటలాడిన తిలక్‌గార్డెన్ పురావస్తు ప్రదర్శన శాల సందర్శకులు లేక అధికారుల నిర్లక్ష్యంతో వెలవెలబోతున్నది. అపురూప శిల్పా లు… శిలాశాసనాలు… తాళపత్ర గ్రంథా లు… అరుదైన వస్తువులతో నిజామాబాద్ పురావస్తు ప్రదర్శనశాల (మ్యూజియం) జిల్లాకే తలమానికంగా నిలిచింది. రూ.లక్షలు వెచ్చించి పునరుద్ధరించినా.. అధికారుల నిర్లక్ష్యంతో చీకటిలో మగ్గుతున్నది. ఆరేండ్లుగా తాళం వేసి ఉంచారు. విద్యుత్ బిల్లుల్లు కట్టలేక రెండేండ్లుగా అంధకారంలో ఉంచారు. శిల్పసంపద, మనదైన చరిత్రను తెలుసుకునే అవకాశం కల్పించాలని చరిత్ర పరిశోధకులు, విశ్రాంత ఉద్యోగులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు
ఇందూరు ఉత్సవాల సందర్భంగా 2001లో అప్పటి కలెక్టర్ అశోక్‌కుమార్ తిలక్‌గార్డెన్‌లోని టౌన్ హాల్లో మ్యూజియాన్ని ప్రారంభించారు. జిల్లాలో ఆయా ప్రాంతాల్లో శిల్పాలు, శిలాశాసనాలు విశేష ప్రాచుర్యం పొందిన తాళపత్ర గ్రంథాలు, నైజాంకాలం నాటి నాణేలు సేకరించి ఇక్కడ పొందుపరిచారు. వారంలో ఒకరోజు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా తిలకించే అవకాశం కల్పించారు. పురావస్తు ప్రదర్శన ప్రాంగణం అంతా చిన్నారులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, చరిత్ర పరిశోధకులతో సందడిగా ఉండేది.
పురాతన భవనం కావడంతో వానకాలంలో ఊరుస్తుండడంతో అపురూప గ్రంథాలు, ఆభరణాలు చెడిపోయే పరిస్థితి వచ్చింది. 2012 నుంచి పలు మరమ్మతుల పేరిట ఇప్పటివరకు మూసే ఉంచారు. గత ఆరేండ్ల క్రితం రూ. 40 లక్షలు వెచ్చించి డంగ్ సున్నం, రంగులతో అభివృద్ధి చేశారు. అపురూప వస్తువులను ఉంచేందుకు అవసరమైన షోకేసులు ఏర్పాటు చేస్తామని అప్పటి అధికారులు చెప్పుకొచ్చారు. పూర్తిస్థాయి సిబ్బంది లేకపోవడంతో మ్యూజియం అంతా దుమ్ము ధూళితో భయానకంగా తయారైంది. 2022లో అప్పటి కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రదర్శనశాలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేసి, అందుబాటులోకి తేవాలని సూచించారు. అయినా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా అధికారులు స్పందించకపోవడంతో అంధకారంలో, నిశ్శబ్ద వాతావరణంలో ఉన్నది. అధికారులు, ప్రజా ప్రతినిధులు పురావస్తు ప్రదర్శన శాలను తెరిపించి, అవసరమైన మౌలిక వసతులు కల్పించి, ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు.
ఇందూరు మ్యూజియాన్ని వెంటనే తెరిపించాలి. జిల్లా చరిత్రను తెలిపే అనేక అంశాలు ప్రదర్శనశాలలో ఉన్నాయి. వీటిని భావితరానికి తెలియజేయడం ఎంతో అవసరం. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి అందుబాటులోకి తీసుకురావాలి.
అమూల్యమైన తాళపత్ర గ్రంథాలు, అరుదైన వస్తువులు, అపురూప శిల్పాలు ఉన్న మ్యూజియాన్ని అవసరమైన మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అధికారుల నిర్లక్ష్యంతో 12 ఏండ్లపాటు మూసి ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. ఉన్నతాధికారులు స్పందించి మ్యూజియాన్ని తెరవాలి.