ఇందల్వాయి, జూన్ 1: జిల్లాలో ఇసుకతోపాటు మొరం దందా జోరుగా సాగుతున్నది. అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతూ అందినకాడికి దండుకుంటున్నారు. ఇందల్వాయి మండలంలో కొందరు అక్రమార్కులు ప్రకృతి వనరులను కొల్లగొడుతూ సొమ్ము చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఇసుక, మట్టిని అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న వారు.. మొరంపైన కూడా కన్నేశారు. గుట్టలను మాయం చేస్తూ మొరం దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిస్తున్నారు. ఇది సంబంధిత అధికారుల దృష్టికి వచ్చినా వారు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడం గమనార్హం.
ఇందల్వాయి మండల కేంద్రంలో కొంత కాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకోవడంతో పలువురు వ్యవసాయ భూములను కొనుగోలు చేసి ప్లాట్లుగా మారుస్తున్నారు. ఆ ప్లాట్లల్లో మొరం వేసి రోడ్లు వేస్తున్నారు. వాల్టా చట్టం ప్రకారం రెవెన్యూ భూముల్లో మొరం తవ్వకాలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలి. ఇందుకోసం కొంత రుసుము చెల్లించాలి. అలాగే గ్రామ పంచాయతీ భూముల నుంచి మొరం తరలిస్తే రుసుము చెల్లించి అనుమతి తీసుకోవాలి. రైతుల పట్టా భూముల నుంచి మొరం తరలించినా రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి తప్పనిసరి. కానీ మొరం వ్యాపారులు ఈ నిబంధనలు గాలికి వదిలి ఇష్టానుసారంగా తవ్వకాలు చేపడుతూ లక్షల రూపాయలు దండుకుంటున్నారు. దీంతో ఆయా శాఖలకు రావాల్సిన ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. మొరం అక్రమ తవ్వకాలు కండ్ల ముందే చేపడుతున్నా అధికారులు కట్టడి చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల శివారులోనూ గుట్టల నుంచి పెద్ద ఎత్తున మొరం తరలిస్తుండడంతో గుట్టలు కనుమరుగవుతున్నాయి. మరోవైపు గుట్టలను తవ్వేస్తూ వ్యవసాయ భూములుగా మార్చుకుంటున్నారు. దీంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. గ్రామ పంచాయతీ పరిధిలో గుట్టల తవ్వకాలు కొనసాగుతుండడం గమనార్హం.
ఒక్కో ట్రాక్టర్కు రూ.500 వసూలు
గుట్టలను కొల్లగొడుతూ మొరం అక్రమంగా తరలిస్తూ అక్రమార్కులు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ మొరం రూ. 300 నుంచి రూ. 500 వరకు విక్రయిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు మొరం తవ్వకాలు చేపట్టి ప్లాట్లను చదును చేసుకుంటున్నారు. అధికారులు స్పందించి మొరం తవ్వకాలను ఆపాలని ప్రజలు కోరుతున్నారు.
మొరం అక్రమ తవ్వకాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. రాత్రివేళలో మొరం అక్రమ తవ్వకాలు ఎవరైనా చేపడితే మాకు సమాచారం ఇవ్వాలని ఆయా గ్రామాల వీఆర్ఏలకు సూచించాం. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం.
-వెంకట్రావు, తహసీల్దార్