నిజామాబాద్, నవంబర్ 16, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ యూనివర్సిటీకి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు కాపీలు చేరినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు నవంబర్ రెండో వారంలోనే తీర్పు కాపీలు టీయూకు రావడంతో ప్రభుత్వ పెద్దల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లేందుకు వీసీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బయటికి తీర్పు కాపీలు తమకు చేరలేదని బుకాయిస్తున్నప్పటికీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక వెలువరించిన 24 కాపీల తీర్పు కాపీలను టీయూ పరిపాలన విభాగం స్వీకరించినట్లు ప్రచారం జరుగుతోంది.
హైకోర్టు తీర్పు అమలును ఇష్టపడని టీయూ పెద్దలు కుట్రపూరితంగా బయటికి అధికారికంగా సమాచారాన్ని వెల్లడించేందుకు ససేమిరా అంటుండడం అనుమానాలకు తావిస్తోంది. ఆది నుంచి 2012 నోటిఫికేషన్ల రద్దు వ్యవహారంలో టీయూ వీసీ, రిజిస్ట్రార్ల తీరు అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసు విషయంలో 13 ఏళ్ల పాటు కొట్లాడిన వెంకట్ నాయక్ సైతం ఇది వరకే హైకోర్టు తీర్పు కాపీలపై న్యాయవాది జొన్నలగడ్డ సుధీర్‌తో అటెస్టెడ్ చేయించి రిజిస్ట్రార్‌కు అందించారు. ఆ సమయంలోనూ తమకు హైకోర్టు రిజిస్ట్రార్ నుంచి అధికారికంగా తీర్పు కాపీ అందలేదనే రిజిస్ట్రార్ సమాధానం ఇచ్చాడు. కానిప్పుడు అధికారింగానే హైకోర్టు తీర్పు కాపీలు టీయూకు చేరినప్పటికి ఎందుకు వెల్లడించడం లేదన్నది అంతు చిక్కడం లేదు.
2012లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక నోటిఫికేషన్ల విషయంలో తొలుత హైకోర్టు స్టే విధించింది. రోస్టర్ అమలులో లోపాలు, రిజర్వేషన్ వర్తింపు అన్నది రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనేది హైకోర్టు భావించింది. అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన స్టేను లెక్కచేయకుండా అక్బర్ అలీ ఖాన్ తుంగలో తొక్కారు. కోర్టు ధిక్కరణకు పాల్పడి ఏకంగా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామక పత్రాలిచ్చి రాత్రికి రాత్రి వారిని విధుల్లో చేర్చుకున్న సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును అవహేళన చేసిన అక్బర్ అలీఖాన్‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకపోవడమే ప్రస్తుత వీసీ, రిజిస్ట్రార్లకు ధైర్యంగా కనిపిస్తున్నట్లుగా అర్థం అవుతోంది.
వాస్తవానికి అక్బర్ అలీఖాన్ వ్యవహారంపై హైకోర్టు పలుమార్లు చివాట్లు పెట్టింది. రిటైర్మెంట్ సమయానికి యూనివర్సిటీ నుంచి రావాల్సిన ప్రయోజనాల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం కోత విధించినట్లుగా ప్రచారం జరుగుతోంది. పూర్వాపరాలు ఇలా ఉంటే వీసీ, రిజిస్ట్రార్లు మాత్రం హైకోర్టు తీర్పును అమలు విషయంలో విచ్చలవిడిగా జాప్యం చేస్తుండటం సమజానికి చెడు సందేశాన్ని అందిస్తోంది. న్యాయ వ్యవస్థకు దక్కాల్సిన గౌరవాన్ని మంటగలుపుతోంది. గ్రూపు 1 నియామకంలో ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును రాత్రికి రాత్రే రేవంత్ రెడ్డి సర్కారు అమలు చేసింది. ఈ లెక్కన టీయూలోనూ 2012 నోటిఫికేషన్ల రద్దును గంటల వ్యవధిలోనే అమలు చేయాల్సి ఉండగా కుంటి సాకులు వెతుకుతుండడం విడ్డూరంగా మారింది.