నిజామాబాద్, అక్టోబర్ 9, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అత్యంత సందిగ్ధత, గందరగోళం మధ్య వెలువడిన స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. సెప్టెంబర్ 29న రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ నాటి నుంచే ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ కనిపించింది. హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై కేసు వేయడం, విచారణ పర్వం సాగుతుండటం వంటి పరిణామాలతో ఎన్నికలు జరిగేవి కావనే స్థాయిలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఓ వైపు న్యాయపరమైన విచారణ సాగుతోన్న సమయంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఏకంగా నోటిఫికేషన్ జారీ చేసింది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేయగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఎక్కడా అంతగా స్పందన రాలేదు. వేచి చూద్దాం అనే ఆలోచనతోనే ఆశావాహ అభ్యర్థులు ఆచితూచి వ్యవహరించారు. రాజకీయ పార్టీ గుర్తులపై జరిగే ఈ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సైతం జాగ్రత్తగా పరిణామాలను గమనిస్తూ ముందుకు సాగుతుండగా ప్రజలంతా ఊహించినట్లే ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. జీవో 9పై స్టే విధించడంతో ఆటోమెటిక్‌గా స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచి పోవాల్సిన గత్యంతరం ఏర్పడింది. జీవో 9 ప్రకారమే మండల పరిషత్, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు, సర్పంచ్, వార్డులకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎన్నికల నిలుపుదల అనివార్యమైంది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా తొలిరోజు నామినేషన్ల ఘట్టం వెలవెలబోయింది. హైకోర్టులో కేసు నడుస్తున్న కారణంతో చాలా మంది ఆశావహులు నామినేషన్ సమర్పణ కేంద్రాలకు వెళ్లనే లేదు. దీంతో పోలీసుల బందోబస్తు మినహా అభ్యర్థుల హడావిడి మచ్చుకైనా కనిపించలేదు. ఏడాదిన్నర కాలంగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ప్రజాప్రతినిధిగా ఎన్నికై ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో అనేకులు రెండేండ్లుగా పావులు కదుపుతున్నారు. ఏడాది క్రితం స్థానిక పోరుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసి వెనక్కి తగ్గింది.
తాజాగా షెడ్యూల్, తొలి విడుత ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ అభ్యర్థుల్లో ఇసుమంతైనా సందడి వాతావరణం కనిపించలేదు. హైకోర్టులో ప్రతికూలత ఎదురైతే తమ పరిస్థితి ఏమిటి? అన్న గందరగోళంలో ప్రజలంతా కొట్టుమిట్టాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేసినప్పటికీ అమలుకు నోచుకుంటాయా? లేదా? అన్న అనుమానమే సర్వత్రా కనిపించింది. హైకోర్టులో వరుసగా రెండో రోజు విచారణ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల అంశంలో లోతుగా అధ్యయనం, విచారణ చేయాల్సిన పరిస్థితి ఉండటంతో హైకోర్టు తక్షణం స్టే విధిస్తూ నిర్ణయం తీసుకోవడంతో మొత్తం ప్రక్రియ మొదటికి వచ్చినైట్లెంది. ఆశావాహులంతా నిట్టూర్చాల్సిన దుస్థితి ఏర్పడింది.
స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఏడాదిన్నర కాలంగా గ్రామ పంచాయతీలు కూనరిల్లుతున్నాయి. ప్రత్యేక అధికారుల పాలనలో మసక బారుతున్నాయి. పాలకవర్గాలు లేకపోవడంతో ప్రజల అవసరాలు తీర్చే వారు కరువయ్యారు. ఈ పరిస్థితిలో సెప్టెంబర్ 30లోపే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ మేరకు ఏర్పాట్లు చేసింది.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించే అంశంలో కాంగ్రెస్ సర్కారు పూటకో రాజకీయానికి పాల్పడింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు మద్దతు తెలిపిన బీసీ రిజర్వేషన్ అంశాన్ని చట్టబద్ధంగా మార్చడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైంది. దీంతో ఈ అంశం కాస్తా హైకోర్టు మెట్లు ఎక్కడంతో న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలు నిజమయ్యాయి. బీసీ ప్రజలను మభ్యపెట్టడానికి రిజర్వేషన్ల అంశంతో కాంగ్రెస్ పార్టీ కుయుక్తులకు పాల్పడిందని ప్రజలంతా మండిపడుతున్నారు. హైకోర్టులో బలమైన వాదనలు వినిపించలేక చేతులు ఎత్తేయడంతో ఎన్నికలు మధ్యంతరంగా ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది.