కామారెడ్డి రూరల్ , జూలై 20: స్త్రీ అంటే సామాన్య వ్యక్తి కాదని, మహాశక్తి అని హైకోర్టు న్యాయమూర్తి జె.శ్రీనివాసరావు అన్నారు. చైతన్యవంతమైన మహిళ ఉండే ఇల్లు ఆదర్శవంతంగా ఉంటుందని, ప్రపంచంలో భారతదేశానికి సముచిత స్థానం రావాలంటే మహిళల ద్వారా ఇంటి నుంచే రావాలన్నారు. మహిళా సాధికారత (నారీశక్తి)పై కామారెడ్డిలోని కళాభారతిలో జిల్లా న్యాయసేవా సాధికారత సంస్థ, మహిళా శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మహిళా స్వయం సంఘాలకు శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు నిర్వహిస్తున్నది ఉద్యోగ బాధ్యతలు మాత్రమే కాదని, వారు చేసేది సామాజిక సేవ అని ప్రశంసించారు. భారత రాజ్యాంగం కుల, మత, లింగ, భాష తదితర భేదభావం లేకుండా పురుషులతో పాటు మహిళలకు సమాన అవకాశాలను కల్పించిందని, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకుని అభివృద్ధి చెందాలని సూచించారు. మహిళా సంక్షేమం కోసం అనేక చట్టాలు ఉన్నాయన్న హైకోర్టు న్యాయమూర్తి.. 1987లో తీసుకొచ్చిన న్యాయసేవా సాధికార సంస్థ చట్టాల ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా అన్ని రకాల కేసుల్లో ఉచిత న్యాయ సహాయం పొందవచ్చన్నారు. జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి డాక్టర్ సిహెచ్వీఆర్ఆర్ వరప్రసాద్, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ సింధుశర్మ, కామారెడ్డి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్‌గౌడ్ పాల్గొన్నారు.