మాక్లూర్, జనవరి 1: కొత్త సంవత్సర వేడుకలు ఏమో కానీ.. మద్యం వ్యాపారం జోరుగా సాగింది. రెండు రోజుల్లోనే రూ.22.68 కోట్ల మందు అమ్ముడు పోయింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరిట యువత ‘ఫుల్లు’గా లాగించేశారు. వేలాది సీసాలను ఖాళీ చేసి పడేశారు. ఓవైపు యువత మత్తులో జోగితే, మరోవైపు సర్కారుకు దండిగా ఆదాయం సమకూరింది. శని, ఆదివారాల్లో కలిపి రెండ్రోజుల్లోనే లిక్కర్, బీర్ కలిపి 41,663 కేసులు అమ్ముడు పోయాయి.
ఉమ్మడి జిల్లాలో మొత్తం 151 వైన్ దుకాణాలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 102, కామారెడ్డి జిల్లాలోని 49 వైన్స్ షాపులు ఉండగా, వీటికి మాక్లూర్ మండలంలోని మాదాపూర్లో గల ఐఎంఎల్ డిపో నుంచి మద్యం సరఫరా అవుతుంది. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా న్యూఇయర్ సందర్భంగా భారీగా మందు అమ్ముడు పోయింది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే సుమారు రూ.23 కోట్ల మద్యం వ్యాపారం జరిగింది. డిసెంబర్ 30వ తేదీన రూ.13.80 కోట్ల విలువ చేసే 12,371 లిక్కర్ కేసులు, 14,556 బీర్ కేసులను ఐఎంఎల్ డిపో నుంచి షాపులకు సరఫరా చేసినట్లు మాక్లూర్ ఎక్సైజ్ ఎస్సై సుదర్శనం తెలిపారు. ఇక, డిసెంబర్ 31న 7,984 లిక్కర్, 6,722 బీర్ కేసులు అమ్ముడు పోయాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.8.88 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి బీర్లతో పాటు లిక్కర్ విక్రయాలు కూడా ఎక్కువగా జరగడం గమనార్హం.
న్యూఇయర్ సంబురాల్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. రెండ్రోజుల ముందు నుంచే వేడుకలకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆదివారం ఉదయం నుంచే మద్యం, మాంసం కొనుగోలు చేసి వేడుకల్లో మునిగి తేలారు. డిసెంబర్ 31.. ఆదివారం కలిసి రావడంతో మద్యం, మాంసం వ్యాపారాలు జోరుగా సాగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యువకులు పొద్దంతా పార్టీల్లో మునిగి తేలారు. పెద్దలు సైతం నూతన సంవత్సర వేడుకల్లో భాగస్వాములయ్యారు. మందు తాగుతూ, డీజేలు పెట్టుకుని డ్యాన్సులు చేస్తూ యువకులు అర్ధరాత్రి వరకూ సాగిన సంబురాల్లో
మునిగి తేలారు.