డిచ్పల్లి/బోధన్ రూరల్/నాగిరెడ్డిపేట/లింగంపేట, అక్టోబర్ 29: మొంథా తుపాను ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట త డిసి పోవడంతో ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలు, కల్లాలు, రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దవుతున్నది. కొన్నిచోట్ల ఆరబెట్టి కొనుగోలుకు సిద్ధం చేసిన ధాన్యం భారీ వర్షాలకు పూర్తిగా తడిసి మొలకలు వస్తున్నాయి. వరదలో వడ్లు కొట్టుకుపోతున్నాయి. కొందరు రైతులు చేసేదేమీలేక ఆరబెట్టిన ధాన్యాన్ని అలాగే వదిలేసి, దేవుడిపై భారం వేసి కంట తడిపెడుతున్నారు.
డిచ్పల్లి, బోధన్, ధర్పల్లి, లింగంపేట, నాగిరెడ్డిపేట తదితర మండలాల్లో మంగళ, బుధవారాల్లో కురిసిన వర్షానికి రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. వడ్ల కుప్పల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. లింగంపేట మండలంలోని శెట్పల్లి, కోమట్పల్లి, పోతాయిపల్లి, కన్నాపూర్, పోల్కంపేట గ్రామాల్లో బుధవారం తేలిక పాటి వర్షం కురిసింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట విక్రయించడానికి కేంద్రానికి తీసుకువచ్చి ఆరబెడితే వర్షం కారణంగా పూర్తిగా తడిసిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కోతకు వచ్చిన ధాన్యం రాలిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షంలో తడువకుండా ఉండడానికి నానా తంటాలు పడుతున్నారు.
తడిసిన ధాన్యానికి రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తుపాను ప్రభా వం మరో రెండు, మూడు రోజులు ఉం టుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయగా.. కొనుగోలు కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం తడవకుండా అధికారులు వెంటనే టార్పాలిన్లు అందించాలని కోరుతున్నారు. ధాన్యం రంగు మారడంతో పాటు మొలకలు వచ్చే అవకాశం ఉన్నదని, అధికారులు స్పందించి గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో తూకం ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.
కామారెడ్డి, అక్టోబర్ 29 : కామారెడ్డి జిల్లాలో వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లపై ఆరబెట్టుకున్న ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యా న్ని మళ్లీ ఆరబెట్టుకుందామంటే వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ ప్రకటించింది. మంగళవారం రాత్రి భారీ వర్షం కురవగా, బుధవారం ఉదయం నుం చి చిరుజల్లులతో కూడిన వర్షం కురిసినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. చేతికి వచ్చిన పంట వర్షార్పణం కావడంతో తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.