పెద్దకొడప్గల్ (పిట్లం)/ఎల్లారెడ్డి రూరల్/నిజాంసాగర్, అక్టోర్ 6 : కామారెడ్డి జిల్లా పిట్లం, పెద్దకొడప్గల్ మండలాల్లో సోమవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి వా గులు, వంకలు పొంగిప్రవహిస్తున్నా యి. చెరువులు నిండి మత్తడి పారాయి. సోయా, పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పిట్లం మండలంలోని తిమ్మానగర్, కల్హేర్ వంతెనలు, కాకి వాగు నిండుగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సైమల్ ఫక్రియా అనే వ్యక్తి ఆకస్మాతుగా వచ్చిన వరదతో కల్హేర్ వాగు ప్రవాహంలో చిక్కుకున్నాడు. విష యం తెలుసుకున్న తహసీల్దార్ రాజు, నరేందర్ గౌడ్ వెంటనే బాన్సువాడ ఫైర్సిబ్బందికి సమాచారం అందించి ప్రమాదంలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడారు. పెద్దకొడప్గల్ మండలంలోని బేగంపూర్ తండాలో వర్షపు నీరు చేరడంతో గ్రామం చెరువును తలపించింది.
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువప్రాంతం నుంచి ఇన్ఫ్లో పెరగడంతో శనివారం రాత్రి నుంచి నిజాంసాగర్ నీటి విడుదలను ఐదు వరద గేట్లకు పెంచి వదులుతున్నట్లు ప్రాజెక్టు ఏఈఈలు అక్షయ్, సాకేత్ తెలిపారు. సోమవారం ఉదయం నాటికి ప్రాజెక్టులో నీటి మట్టం 1405.00 అడుగులు (17.80 టీఎంసీలు) ఉన్నదని పేర్కొన్నారు. ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులోకి 32,820 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, అంతే స్థాయిలో ఐదు వరద గేట్ల ద్వారా నీటిని మంజీరాలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు
బిచ్కుంద, అక్టోబర్ 6: జుక్కల్ మండలంలో కుండపోతగా కురిసిన వర్షానికి లాడేగావ్-చిన్న ఏడ్గి గ్రామాల మధ్య వాగు పొంగి ప్రవహిస్తున్నది. దీంతో రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కురుస్తున్న వర్షాలకు సోయా పంట నూర్పిళ్లు చేపట్టిన అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించి చేతికొచ్చిన పంటలు నేలపాలవడంతో ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
తాత్కాలిక మరమ్మతులు చేపట్టిన ఎల్లారెడ్డి మండలం లోని తిమ్మాపూర్ పెద్దచెరువు కట్ట సోమవారం మళ్లీ తెగిపోయింది. 40 రోజుల క్రితం వరదలకు చెరువు కట్ట తెగిపోవడంలో 35 రోజుల అనంతరం ఇరిగేషన్ అధికారులు రూ.10లక్షలతో తాత్కాలిక మరమ్మతులు చేయించి చేతులు దులుపుకొన్నారు. మరమ్మతులో నాణ్యత లోపించడంతో వరద మెల్లిమెల్లిగా చెరువులోకి చేరుతున్నది. అడ్డుగా వేసిన ఇసుక బస్తాలు వరద ఒత్తిడిని తట్టుకోలేకపోయాయి. సోమవారం ఉదయం వరద ఉధృతికి ఇసుకబస్తాలు పక్కకు పడిపోవడంతో కట్టతెగిపోయి చెరువులోకి చేరిన వరద ఖాళీ అవుతున్నది. చెరువుకట్టకు శాశ్వత నిర్మాణ పనులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.