ఖలీల్‌వాడి, జూన్ 25 : నిజామాబాద్ జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల్లో గురువారం వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలో గంటపాటు వర్షం కురియడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రధాన రోడ్లతోపాటు పలు కాలనీల్లో రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొన్నటి వరకు మండుటెండలు.. ఉక్క పోతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు, వర్షంతో ఉపశమనం పొందారు.
మోర్తాడ్, జూన్ 25: వానలు కురవాలని కోరుకుంటూ కమ్మర్పల్లి మండల కేంద్రంలో గ్రామకమిటీ ఆధ్వర్యంలో గురువారం గ్రామదేవతలకు జలాభిషేకం నిర్వహించారు. గ్రామస్తులు బిందెల్లో నీళ్లు నింపుకుని గ్రామంలోని కసీర్ హనుమాన్ నుంచి నరసింహస్వామి, పోచమ్మ, పెద్దమ్మ, జంబిహనుమాన్, నల్లపోచమ్మ, శివాలయం, బ్రహ్మంగారి ఆలయం, సరస్వతీ ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. అన్ని ఆలయాల్లో జలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామకమిటీ అధ్యక్షుడు మల్యాల సుభాష్‌గౌడ్, వివిధ కుల సంఘాల పెద్దలు పాల్గొన్నారు.