కంఠేశ్వర్/బాన్సువాడ రూరల్, ఆగస్టు 7: ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా పోలీసు కార్యాలయ సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమయానికి పోలీసులు, నగరపాలక సంస్థ సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో స్థానికులే రోడ్డుకు అడ్డుగా బారికేడ్లు ఉంచి వాహనదారులను అప్రమత్తం చేశారు. అండర్ బ్రిడ్జి వద్ద సుమారు 10 అడుగుల మేర వరద చేరడంతో ఈ మార్గాన్ని మూసేశారు.
బాన్సువాడ మండలంలో నీట మునిగిన పంట పొలాలు
బాన్సువాడ మండలంలోని బోర్లం, ఇబ్రహీంపేట్, కొయ్యగుట్ట, పోచారం, హన్మాజీపేట్, సంగోజీపేట్, కోనాపూర్ తదితర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. వర్షపు నీటికి పంట పొలాలు మునిగి పోయాయి. కొల్లూరు వాగు, చేదల వాగు, అవాజ్పల్లి చెక్డ్యాముకు భారీ వరద పోటెత్తడంతో నిండుగా ప్రవహిస్తున్నాయి. వారం రోజులుగా వర్షాలు లేక పోవడంతో రైతులు ఆందోళన చెందారు. కురిసిన వర్షం పంటలకు ఊపిరి పోసింది. సాగునీటి కొరతతో ఇబ్బంది పడ్డ రైతులకు ఈ వానలు కాసింత ఉపశమనం కలిగించాయి.