నిజామాబాద్, జూలై 27, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కుంభవృష్టితో ఉభయ జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. వారం రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉమ్మడి జిల్లాను కుమ్మేస్తున్నాయి. వరుణుడి ప్రతాపం కొనసాగుతుండడంతో ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బుధ, గురువారాల్లో కురిసిన వర్షాలతో జనజీవనం స్తంభించింది. వరదల ధాటికి ఎక్కడికక్కడ రహదారులు తెగిపోయాయి. రాకపోకలు నిలిచిపోయాయి. అనేక పల్లెలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలతో పాటు ప్రధాన జలాశయాలు నిండుకుండల్లా మారాయి. వరదతో ఊర్లు, పొలాలు ఏకమయ్యాయి. నిజాంసాగర్ మండలంలోని నల్లవాగు మత్తడిలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఒకరు గల్లంతయ్యారు. నందిపేట మండలం కుద్వాన్పూర్ చెరువు అలుగులో చేపలు పట్టేందుకు వెళ్లి వల కాళ్లకు చుట్టుకొని మరొకరు మృతి చెందారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. అతి భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు గ్రామాల్లో చెరువులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రహదారులు కోతకు గురయ్యాయి. పలు గ్రామాల్లో ఇండ్లు కూలిపోయాయి. ప్రాజెక్టులకు వరద పెరగడంతో గేట్లను ఎత్తి మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు.