ఉమ్మడి జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. 20 రోజులకు పైగా ముఖం చాటేసిన వర్షాలు రెండ్రోజులుగా విస్తృతంగా కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగుతున్నాయి. ప్రాజెక్టులు, చెరువులు జల కళ సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని చెరువులు మత్తడి దూకుతున్నాయి. ఎండుముఖం పట్టిన పంటలకు ప్రస్తుతం కురుస్తున్న వానలు జీవం పోశాయి. మిగిలిపోయిన చోట్ల నాట్లు ఊపందుకున్నాయి. మరోవైపు, రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
-నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 26
తెరిపినివ్వని వాన..
రెండ్రోజులుగా వాన తెరిపినివ్వకుండా కురుస్తున్నది. శుక్ర, శనివారాల్లో నిరంతరం జల్లులు కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విద్యార్థులు, ఉద్యోగులు వర్షంలోనే తడుస్తూ వెళ్లాల్సి వచ్చింది. చాలా మంది ఇండ్లకే పరిమితమయ్యారు. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. నిజామాబాద్ నగరంతో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ పట్టణాల్లో పెద్దగా రద్దీ కనిపించలేదు. అత్యవసర పని ఉన్న వాళ్లు మాత్రమే బయటికి వచ్చారు. ఆగకుండా జల్లులు కురుస్తుండడం, రోడ్లపై నీరు నిలువడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
పంటలకు ప్రాణం..
సీజన్ ఆరంభంలో మంచి వానలు కురియడంతో రైతులు ఉత్సాహంగా పంటలు సాగు చేశారు. అయితే, మొదట్లో మురిపించిన వానలు తరువాత ముఖం చాటేశాయి. వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొనగా, నీళ్లు లేక చాలాచోట్ల నాట్లు వేయలేదు. ప్రస్తుతం జోరువానలు కురుస్తుండడంతో పంటలకు జీవం పోసినట్లయింది. మిగిలి పోయిన చోట్ల నాట్లు ఊపందుకున్నాయి. బాన్సువాడ మండలంలోని గట్టుమీది గ్రామాలైన హన్మాజీపేట్, సంగోజీపేట్, కాద్లాపూర్, కోనాపూర్ గ్రామాలలో సోయా పంటలకు ఊపిరి పోసింది.
ప్రాజెక్టులకు జలకళ
ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు వరద వచ్చి చేరుతున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకు 6500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుంగా, నీటిమట్టం 22.053టీఎంసీలకు చేరింది. ఇక నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 1,269 క్యూసెక్కుల వరుద వస్తున్నది. పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.80 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1390.50 అడుగుల (4.25టీఎంసీ )లకు చేరింది. కల్యాణి ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
కల్యాణి, అడవిలింగాల్, తిమ్మాపూర్, తాటివాని మత్తడి, భవానీపేట్ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ప్రాజెక్టులోకి 600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నది. ప్రాజెక్ట్ నీటి మట్టం 408.50 మీటర్లకు చేరుకోవడంతో రెండు రేడియల్ గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. లింగంపేట పెద్ద వాగు, గుండారం వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పోచారం ప్రాజెక్టులోకి 1515 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. పూర్తి స్థాయి నీటి 1.820 టీఎంసీలకు గాను, 0.700 టీఎంసీల నీరు నిల్వ ఉందని డీఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఉప్పొంగిన వాగులు..
భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. లింగంపేట, తాడ్వాయి మండలాల్లోని వాగులు, వంకలు కళకళాడుతున్నాయి. పెద్ద వాగుతో పాటు పాముల వాగు జల కళ సంతరించుకుంది. కోమట్‌పల్లి ఊర చెరువు, టేకుల పోతాయిపల్లి చెరువు అలుగు పోస్తున్నాయి. ధర్పల్లి మండలంలోని పలు వాగులు నిండుగా ప్రవహిస్తున్నాయి. మాటు కాలువ ద్వారా పెద్ద చెరువుకు వరద కొనసాగుతున్నది. బాన్సువాడ-ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ఉన్న చెదల వాగు వరద నిండుగా ప్రవహించింది. బాన్సువాడ మండలం హన్మాజీపేట్ పరిధిలోని అవాజ్పల్లి చెక్‌డ్యాం మత్తడి దూకింది.
మత్తడి దూకుతున్న చెరువులు..
ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామంలోని అతి పురాతనమైన శీలం జానకీబాయి చెరువు శనివారం సాయంత్రం మత్తడి పోస్తున్నది. ఎత్తుగా ఉండే మత్తడి నుంచి దూకే వరద జలాలు కిందకు దూకే సుందర దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు తరలి వచ్చారు. బోధన్ పట్టణ దాహార్తి తీర్చే బెల్లాల్ చెరువు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మత్తడి దూకింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో బోధన్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. కోటగిరి మండలంలోని చెరువులు జలకళ సంతరించుకుంటున్నాయి.
మునిగిన పంటలు నిలిచిన రాకపోకలు..
తాడ్వాయి మండలం దేమే, కన్కల్ గ్రామాల మధ్య గల వాగు ఉధృతంగా ప్రవహించి, రోడ్డుపైకి నీరు రావడంతో రాకపోకలు నిలిచి పోయాయి. తహసీల్దార్ శ్వేత, ఎస్సై మురళి అక్కడకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. వరద ఉధృతి తగ్గే వరకు రాకపోకలను నిలిపి వేశారు. వరద తగ్గిన అనంతరం రాకపోకలు కొనసాగాయి. బోర్లం, ఇబ్రహీంపేట్, జక్కల్‌దాని తండా గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. రుద్రూర్ మండలం అంబం శివారులో వరి పైర్లను వరద ముంచేత్తింది.
రాకపోకలు బంద్
రామారెడ్డి, జూలై 26: గంగమ్మ వాగు ఉధృతంగా ప్రవహించడంతో రామారెడ్డి-కామారెడ్డి మధ్య రాకపోకలు నిలిచి పోయాయి. వాగుపై రెండేండ్లుగా నిలిచిపోయిన వంతెన నిర్మాణ పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. తాత్కాలికంగా వేసిన రహదారికి గండి పడడంతో ముందస్తు జాగ్రత్తగా రాకపోకలను నిలిపివేశారు. కామారెడ్డి ఆర్డీవో వీణ, రూరల్ సీఐ రామన్, తహసీల్దార్ ఉమాలత, ఎంపీడీవో రాజేశ్వర్, ఎస్సై లావణ్య పరిస్థితిని సమీక్షించారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణం చేయాలని అధికారులు సూచించారు.