కామారెడ్డి, మే 21: ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం రాత్రి, బుధవారం భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయ్యింది. పంట కొనుగోలు చేయడంతో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
కామారెడ్డిలోని గంజ్మార్కెట్లో ఆరబోసిన ధాన్యం వర్షంతో పూర్తిగా తడిసింది. రైతులు బుధవారం ధాన్యాన్ని ఆరపెట్టేందుకు నానా కష్టాలు పడ్డారు. రామారెడ్డిలో ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. ప్రజలు బకెట్లతో నీటిని తోడిపోశారు. నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో పెండ్లి కోసం ఏర్పాట్లు చేసుకోగా.. వర్షంతో నీరు నిలిచింది. దీంతో వివాహాన్ని మరో ప్రదేశంలో జరిపించారు. వర్షానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. లింగంపేటలోని పంట పొలాల్లో వర్షపు నీరు నిలిచింది.
సిరికొండ మండలం తూంపల్లి కప్పల వాగుకు వరద వచ్చింది. ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లి వాగు బుధవారం ఉదయం నుంచి నీటితో ఉధృతంగా ప్రవహించింది. కోటగిరి మండల కేంద్రంలో మురికి కాలువలను అధికారులు పొక్లెయిన్ సహాయంతో శుభ్రం చేయించారు. భారీ వర్షంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. రెంజల్ మండలం పేపర్‌మిల్ గ్రా మంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో పొగాకు గట్టలు తడిసిపోయాయి. కాగా ఇన్నిరోజులు ఉక్కపోతతో బాధపడగా.. వాతావరణం ఒక్కసారిగా చల్లబడిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎస్సారెస్పీకి 2,894 క్యూసెక్కుల వరద
మోర్తాడ్, మే 21: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ భాగంలో వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి వరద పెరిగింది. బుధవారం ప్రాజెక్ట్‌లోకి 2,894 క్యూసెక్కుల వరద వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 091అడుగులు(80.5టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 1060.90 అడుగుల (11.44టీఎంసీల) నీటి నిల్వ ఉన్నది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువకు 100 క్యూసెక్కులు, మిషన్‌భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా.. 302 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతున్నది.