ఖలీల్వాడి/కంఠేశ్వర్/ కోటగిరి/భీమ్గల్/డిచ్పల్లి/బోధన్, మే 5: ఉమ్మడి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంతోపాటు డిచ్పల్లి, భీమ్గల్, కోటగిరి, బోధన్, సాలూర, ఎడపల్లి తదితర మండలాల్లో సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. సుమారు గంటన్నరపాటు కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
జిల్లాకేంద్రంలోని మార్కెట్యార్డుతోపాటు డిచ్పల్లి మండలంలోని డిచ్పల్లి, నడ్పల్లి, ధర్మారం, బర్ధిపూర్, రాంపూర్, సుద్దులం, యానంపల్లి, మిట్టాపల్లి, మెంట్రాజ్పల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న వరి ధాన్యం తడిసి ముద్దయ్యింది.
ఒకసారిగా వర్షం కురవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి వారు నానా పాట్లు పడ్డారు. కొద్దిరోజులుగా కొనుగోలు కేంద్రాలకు లారీలు సక్రమంగా రాకపోవడంతో తూకం వేసిన బస్తాలు ఎక్కడికక్కడే కొనుగోలు కేంద్రాల్లో ఉండిపోయాయి.
దీనికి తోడు ఈదురుగాలులతో మామిడికాయలు సైతం రాలిపోయాయి. రెండు గంటల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. భీమ్గల్ పట్టణంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లు నేలకూలాయి. దీంతో భీమ్గల్ నుంచి ఆర్మూర్ వరకు వయా వేల్పూర్ మీదుగా వెళ్లే ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులే దిగి వాహనాలను పక్కన నిలిపి స్వయంగా రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్లను పక్కకు తొలగించారు.