నిజాంసాగర్/మోర్తాడ్, సెప్టెంబర్ 3: ఉమ్మడి జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్‌లోకి భారీగా వరద వస్తున్నది. మంగళవారం సాయంత్రానికి 34,400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405.00 అడుగుల (17.802 టీఎంసీలు)కు గాను మంగళవారం సాయంత్రానికి 1401.66 అడుగుల (13.270 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు ఏఈ శివప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. వరద ఇలాగే కొనసాగితే బుధ లేదా గురువారం నాటికి గేటు ్లఎత్తే అవకాశం ఉంది.
ఎస్సారెస్పీకి తగ్గని వరద
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి 2.40 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో అంతే మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా, మంగళవారం రాత్రి 9 గంటలకు 1088 అడుగుల (70.140 టీఎంసీలు) మేర నీటి నిల్వ కొనసాగిస్తూ, మిగులు జలాలను విడిచి పెడుతున్నారు. 41 గేట్లు ఎత్తి 2.15 లక్షల క్యూసెక్కులను దిగువ గోదావరికి వదులుతుండగా, వరద కాలువకు 17 వేలు, కాకతీయ కాలువకు 4 వేలు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4 వేలు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు దిగువన గల జల విద్యుదుత్పత్తి కేంద్రంలోని నాలుగు టర్బయిన్ల ద్వారా 36 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నట్లు జెన్కో అధికారులు తెలిపారు.
పొలాలను ముంచెత్తిన ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్
నవీపేట, సెప్టెంబర్ 3: మండలంలోని మిట్టాపూర్ శివారులోని వందలాది ఎకరాల పంట నీట మునిగింది. శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ ముంచెత్తడంతో వరి పైర్లు పూర్తిగా మునిగి పోయాయి. మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తింది. మండలంలోని యంచ, నందిగామ, మిట్టాపూర్, కోస్లీ,బినోలా తదితర గ్రామాలకు చెందిన పంట పొలాలను శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ ముంచెత్తింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.