బిచ్కుంద, ఏప్రిల్ 6: మండలంలోని దౌల్తాపూర్ గ్రామం మంచం పట్టింది.కొన్నిరోజులుగా గ్రామస్తులు మోకాళ్లు, కీళ్లు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. గ్రామంలో సుమారు 120 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. 15 రోజుల క్రితం ఇద్దరితో మొదలైన బాధితుల సంఖ్య ఇప్పటివరకు 40 మందికి చేరింది. ఇందులో కొందరికి రక్తంలోని ప్లేట్లేట్ల సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. అసలు ఏ వ్యాధి సోకిందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ దవాఖాన వెళ్తే పరీక్షలు నిర్వహించకుండా కేవలం మాత్రలు ఇచ్చి పంపించారని వాపోతున్నారు. దీంతో గ్రామస్తులు స్థానిక ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు.
ఆర్థిక స్థోమత ఉన్నవారు మహారాష్ట్రలోని దెగ్లూర్, బాన్సువాడ, నిజామాబాద్‌కు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. గ్రామస్తులు అనారోగ్యం బారిన పడ్డారని తెలిసినా అధికారులు గ్రామం వైపు కన్నెత్తి చూడడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ విషయమై పుల్కల్ పీహెచ్సీ డాక్టర్ సమద్‌ను వివరణ కోరగా గ్రామస్తులు అనారోగ్యం బారిన పడినట్లు తన దృష్టికి రాలేదని తెలిపారు.సోమవారం తమ సిబ్బందితో కలిసి గ్రామంలో వైద్య పరీక్షలు నిర్వహించి, మందులను అందజేస్తామని పేర్కొన్నారు.
నేను పదిహేను రోజుల నుంచి మోకాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న. ఎన్ని గోలీలు మింగినా తగ్గుతలేదు. నాలెక్క ఊర్ల చాలా మందికి అయితుంది. పెద్ద సార్లు మా ఊరికి వచ్చి పరీక్షలు చేయాలి.
-హన్మవ్వ, గ్రామస్తురాలు
నేను కూడా మోకాళ్లు, కీళ్ల నొప్పులతో బాధ పడుతున్న. నా మాదిరిగా మా ఊరిలో చాలా మంది బాధ పడుతున్నరు. సర్కారు దవఖానకుపోయి గుల్కోజ్ పెట్టమంటే గోలీలు ఇచ్చి పంపించిన్రు. అధికారులు స్పందించి మాఊరిలో క్యాంపు ఏర్పాటు చేయాలి.
-హన్మంత్ రావు పటేల్, గ్రామస్తుడు