నిజామాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనంపై మాజీ ఇరిగేషన్ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అద్భుత స్పందన వచ్చింది. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో శ్రేణులనుద్ధేశించి ఇచ్చిన వివరణాత్మక సందేషంలో అద్భతమైన విషయాలను సంపూర్ణంగా వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు పాలనను గాలికి వదిలేసి కేసీఆర్‌పై చేస్తోన్న కుట్రలు, కుతంత్రాలపై తనదైన శైలిలో పూస గుచ్చినట్లు చెప్పారు.
అధికారిక సమాచారాన్ని ముందు పెట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టతలను కళ్లకు కట్టారు. అబద్ధాలను ప్రచార చేస్తూ బీఆర్ఎస్పై ప్రజల్లో చెడును వ్యాప్తి చేసే ప్రయత్నం చేస్తోన్న రేవంత్ రెడ్డి తీరును గులాబీ శ్రేణులంతా అర్థం చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేయగా జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్ గుప్తా, జడ్పీ మాజీ ఛైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు, బాజిరెడ్డి జగన్, ఇతర ముఖ్య నేతలంతా హాజరయ్యారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో గంప గోవర్ధన్ క్యాంప్ కార్యాలయంలో డిజిటల్ స్క్రీన్‌పై కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు… కమిషన్ వక్రీకరణలు, వాస్తవాలు కార్యక్రమాన్ని మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్‌లు పాల్గొన్నారు. జార్ఖండ్ మాజీ సీఎం అంత్యక్రియలకు వెళ్లిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సైతం మార్గమధ్యలోనే మొబైల్ ఫోన్లో వీడియోను వీక్షించారు.
కుట్రలు పటాపంచలు..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి తీసుకున్న అనుమతులు దగ్గరి నుంచి నిపుణుల కమిటీ పరిశీలన, అధ్యయనాలు, వివిధ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల సలహాలు, సూచనలకు సంబంధించిన వివరాలను ఆధార సహితంగా మాజీ మంత్రి హరీశ్ రావు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ముందు తెలంగాణ ప్రాంతం ఏ విధంగా ఎడారిగా మారిందో చిత్ర ప్రదర్శనలతోనూ వివరించారు. మూడేళ్లలోనే అద్భుతమైన చారిత్రక ప్రాజెక్టును నిర్మించి చరిత్ర సృష్టించిన కేసీఆర్‌పై రాజకీయ కక్ష సాధింపు ఏ విధంగా జరుగుతున్నదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో స్పష్టమైంది.
ఎన్డీఎస్ఏ అనే సంస్థ ద్వంద నీతిపై ప్రత్యేకంగా హరీశ్ రావు వివరణను ఇచ్చారు. పోలవరం కూలితే, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగితే ఎన్డీఎస్ఏ పట్టించుకోకపోవడాన్ని కళ్లకు కట్టినట్లుగా హరీశ్ రావు చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్లీనంగా దాగి ఉన్న అనేక రిజర్వాయర్లు, టన్నెళ్లు, కాలువలు, సర్జ్‌పూల్, పంప్‌హౌస్‌లు ఇలా ప్యాకేజీల వారీగా వివరణాత్మకంగా వివరించారు.
ప్రతి అంశంపై సూటిగా, స్పష్టంగా హరీశ్ రావు ఇచ్చిన సందేశాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలంతా శ్రద్ధగా విన్నారు. జయహో కాళేశ్వరం ప్రాజెక్టు… అంటూ నినదించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన కార్యక్రమానికి శ్రేణుల నుంచి అపూర్వమైన స్పందన వచ్చింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలతో పాటుగా మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా హాజరై హరీశ్ రావు ప్రసంగ పాఠాన్ని విన్నారు.
ఉమ్మడి జిల్లాకు లబ్ధి
కాళేశ్వరం ప్రాజెక్టుతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలను పచ్చని పంట పొలాలతో విరాజింపజేసేందుకు గత కేసీఆర్ సర్కారు కృషి చేసింది. ఇందులో భాగంగానే ప్యాకేజీ 20, 21 తీసుకు వచ్చింది. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ఆధారంగా డిజైన్ చేసిన ఎత్తిపోతల పథకాల ద్వారా నాన్ కమాండ్ ఏరియాకు సాగు నీళ్లు తీసుకు వచ్చి లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని సంకల్పించింది. హరీశ్ రావు ఇచ్చిన వివరణలో వీటిపైనా సమగ్ర సమాచారం వచ్చింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు కలిగే ప్రయోజనంపైనా పవర్ పాయిట్ ప్రజెంటేషన్‌లో ప్రస్తావించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తర్వాత కేవలం ఏడాది కాలంలోనే 24గంటల కరెంట్, మిషన్ కాకతీయ పథకంతో చెరువుల పునరుద్ధరణ, పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చడం వంటి అనేక కార్యక్రమలాను మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పుకు వచ్చారు. రేవంత్ రెడ్డి నిర్లక్ష్యపు వైఖరి, కుట్రపూరిత తత్వంపై తనదైన శైలిలో వాగ్భామాలు సంధించినప్పుడు బీఆర్ఎస్ శ్రేణులతో సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి చెప్పిన సందర్భంలో జై కేసీఆర్ నినాదాలు మారుమోగాయి. ఎలాంటి రాజకీయ ప్రసంగాలు లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టుపై సుమారుగా గంటన్నర సేపు హరీశ్ రావు ప్రజెంటేషన్ కొనసాగింది. గులాబీ శ్రేణులంతా శ్రద్ధగా వివరాలను నోట్ చేసుకున్నారు.
ఫోన్లో వీక్షించిన మాజీ మంత్రి వేముల
మోర్తాడ్, ఆగస్టు 5: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాలపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మి మొబైల్లో వీక్షించారు. మాజీ సీఎం శిబూ సోరెన్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వారు జార్ఖండ్‌కు వెళ్లా రు. రాంచీ నుంచి సోరెన్ సొంత గ్రామానికి వెళ్తూ కాళేశ్వరంపై హరీశ్‌రావు ఇస్తున్న పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌ను వారు మొబైల్ ఫోన్లో వీక్షించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ కార్యాలయంలో పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌ను చూస్తున్న కార్యకర్తలతో వేముల మాట్లాడారు.