గిరిజన భూసంస్కరణలు, పరిపాలన వ్యవస్థలపై వరంగల్ జిల్లాకు చెందిన దివంగత పొట్లపల్లి కమల మనోహర్‌రావు సహా బృందం నివేదికపై ప్రపంచ ప్రఖ్యాత మానవ శాస్త్రవేత్త, లండన్‌లోని స్కూల్ ఆఫ్ ఏషియన్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్‌లో ప్రొఫెసర్ హైమెండార్ఫ్ రాసిన చారిత్రక nఅభినందన లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది. గిరిజన సమాజంపై లోతైన అధ్యయనం కోసం 1985 డిసెంబర్ 11న ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు కమల మనోహర్‌రావు ఒక నివేదికను హైమెండార్ఫ్కు సమర్పించారు.
కమల మనోహర్‌రావు ఆదివాసీ సమాజానికి చేసిన సేవలపై ఒక విశ్లేషణ. ‘కమల మనోహరరావు మాకు ఒక అధికారి కాదు. మాకు దేవుడు. చదువు విలువను చెప్పి మాకు కొత్త జీవితాలను ప్రసాదించారు. ఆయన వల్లనే ఈ రోజు మా గోండు కమ్యూనిటీ నుంచి టీచర్లు, డాక్టర్లు, అధికారులుగా ఎదిగాం’ అని అన్నారు ఆదిలాబాద్‌కు చెందిన రిటైర్డ్ ఎమ్మార్వో కోవ మనోహర్. ‘కమల మనోహర్‌రావు పాలసీలు కాగితాలకే పరిమితం కాలేదు. అవి గిరిజనుల జీవితాల్లోకి వెళ్లాయి. తెలంగాణలో కొన్ని వందల ఎకరాల భూమి పట్టాలు మూలవాసులకు చెందటంలో ఆయన చేసిన కృషి అపూర్వం. ఆయన గిరిజన సంక్షేమాన్ని దయగా కాదు… హక్కుగా చూశారు. అదే ఆయనను చరిత్రలో నిలబెట్టింది’ అని అంటారు ప్రముఖ ఆంత్రోపాలజిస్ట్ వీఎస్వీకే శాస్త్రి.
‘భూమి కాగితంపై ఉండొచ్చు… కానీ గిరిజనుడి జీవితంలో అదొక ఆత్మగౌరవం’ అనే మాటలు నమ్మి పనిచేసిన వ్యక్తి కమల మనోహర్‌రావు. ఇప్పటికీ వేలాది గిరిజన కుటుంబాల జీవితాల్లో ఆయన జీవిస్తూనే ఉన్నారు. చాలామంది చరిత్రను చదువుతారు. కొంతమంది చరిత్రను రాస్తారు. కానీ అరుదుగా ఒక మనోహర్‌రావు వేలాది గిరిజన కుటుంబాల భవిష్యత్తునే మలిచారు. ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగి కథ కాదు.
ఇది అడవుల్లో జీవించిన సమూహాలకు ఆత్మవిశ్వాసం ఇచ్చిన కథ. భూమి లేని చేతులకు పట్టా ఇచ్చిన పోరాటం. చదువు ముఖం చూడని పిల్లలకు వెలుగు చూపించిన జీవన ప్రయాణం ఆయనది. ‘మా గూడెల్లోకి వచ్చి, మాతో నేల మీదే కూర్చొని మాట్లాడేవాడు. మా మధ్య ఐక్యత పెంచాడు. మా పిల్లలకు చదువు చెప్పించాడు. అలాంటి పిల్లల్లో నేను ఒకడిని. టీచర్‌గా పనిచేసి, ఈ రోజు గోండు గిరిజనులకు నాయకుడిగా మారాను. ఆయన మా మనసులు తెరిచాడు. అందుకే ఆయన మాకు అధికారి కాదు… మా మనిషి’ ఆసిఫాబాద్‌లో మాతో మాట్లాడుతూ గోండు గిరిజన నాయకుడు సిదం అర్జు గుర్తుచేసుకుంటారు.
తెలంగాణలోని జనగామ జిల్లా, అశ్వారావుపల్లి గ్రామంలో 1919 డిసెంబర్ 20న జన్మించిన కమల మనోహర్‌రావు, గ్రామీణ జీవితాన్ని దగ్గరగా చూశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆంత్రోపాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. గిరిజనులు వెనుకబడి ఉండడానికి కారణం ఏమిటి? అనే ప్రశ్న విద్యార్థి దశలోనే ఆయనను వెంటాడింది. ఆ ప్రశ్నే ఆయన జీవిత దిశను మార్చింది. నిజాం ప్రభుత్వ సామాజిక సంక్షేమ శాఖలో చేరిన తర్వాత గిరిజన సంక్షేమం అనేక శాఖల మధ్య చీలిపోయి ఉన్నదని గ్రహించారు. ఒకరి సమస్యకు పది కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎందుకు? అనే ప్రశ్నతోనే ‘సింగిల్ విండో పరిపాలన’ ఆలోచన పుట్టింది. ఎన్నో చర్చలు… ఎన్నో అడ్డంకులు దాటిన తర్వాత చివరికి 1966లో గిరిజన సంక్షేమశాఖ ఏర్పాటైంది. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చొరవతో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ తొలి డైరెక్టర్‌గా కమల మనోహర్‌రావు బాధ్యతలు చేపట్టారు.
కమల మనోహర్‌రావు డైరెక్టర్ అయిన తర్వాత ఆయన కార్యాలయానికే పరిమితం కాలేదు. గిరిజన గూడేల్లోకి వెళ్లారు. గోండు, కొలాం, కొండరెడ్డి, లంబాడీ, కోయ తెగల ప్రజల మధ్య నడిచారు. భూమి హక్కులు లేక తరతరాలుగా అడవుల్లో జీవిస్తున్న వారికి పట్టాలు ఇప్పించారు. పాఠశాలలు, హాస్టళ్లు నిర్మించారు.
‘ఆయన మాకు భూమి ఇచ్చిన రోజు మా ఇంట్లో దీపం వెలిగింది. భూమి అంటే బతుకు అని ఆయన మాకు చెప్పాడు. వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, నర్సంపేట, ములుగులో నిరుపేద ఎస్సీ, ఎస్టీలకు 40,000 ఎకరాల భూమిని కేటాయించి, గృహ నివాస కాలనీలు, వాటర్ ట్యాంక్‌లు ఏర్పాటు చేశారు’ అన్నారు అశ్వారావుపల్లి మాజీ సర్పంచ్ రాంచందర్.
లండన్ యూనివర్సిటీకి చెందిన ప్రఖ్యాత ఆంత్రోపాలజిస్ట్ డాక్టర్ క్రిస్టోఫ్ వాన్ ఫ్యూరర్-హైమెండార్ఫ్, కమల మనోహర్‌రావు సేవలను ప్రత్యేక లేఖల ద్వారా ప్రశంసించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆంత్రోపాలజీ విభాగం స్థాపించిన హైమెండార్ఫ్ వద్ద కమల మనోహర్‌రావు విద్యార్థి. ఆ బంధమే ఆయనకు భారత గిరిజన అధ్యయనానికి శాశ్వత గుర్తింపు తెచ్చింది.
కమల మనోహర్‌రావు 1975లో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా ఆయన ఆలోచనలు అంతటితో ఆగలేదు. గిరిజనుల జీవన విధానంపై ఆయన రాసిన పుస్తకాలు, పరిశోధనలు ఈనాటికీ ఎంతోమందికి మార్గదర్శకాలుగా నిలిచాయి. 1968లో మాడగడ గిరిజన పల్లెపై చేసిన కేస్ స్టడీ ఆంధ్రప్రదేశ్‌లోని అరకు ప్రాంతం పర్యాటక కేంద్రంగా మారడానికి పునాది వేసింది. ఆయన 1995 ఫిబ్రవరి 17న పరమపదించారు. పొట్లపల్లి కమల మనోహర్‌రావు ప్రభుత్వంలోని ఒక అధికారి మాత్రమే కాదు. ఆయన ఆదివాసీల గుండెల్లో నిలిచిపోయిన విశ్వాసం. ఆయన కృషితో వేలాదిమంది గిరిజన పిల్లలు చదువుకొని, ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నారు.
‘కమల మనోహర్‌రావు పాలసీలు కాగితాలకే పరిమితం కాలేదు. అవి గిరిజనుల జీవితాల్లోకి వెళ్లాయి. తెలంగాణలో కొన్ని వందల ఎకరాల భూమి పట్టాలు మూలవాసులకు చెందటంలో ఆయన చేసిన కృషి అపూర్వం. ఆయన గిరిజన సంక్షేమాన్ని దయగా కాదు… హక్కుగా చూశారు. అదే ఆయనను చరిత్రలో నిలబెట్టింది’ అని అంటారు ప్రముఖ ఆంత్రోపాలజిస్ట్ వీఎస్వీకే శాస్త్రి.
– శ్యాంమోహన్ 9440595858