NTR | టీడీపీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గురువారం ఉదయం ఘాట్‌కు చేరుకుని తన తాతయ్య ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. ఉదయం సుమారు 6 గంటల సమయంలో ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్న తారక్.. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. అనంతరం కొద్దిసేపు అక్కడే నిశ్శబ్దంగా నేలపై కూర్చుని ధ్యానం చేశారు. తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలను స్మరించుకుంటూ భావోద్వేగానికి లోనైనట్లు కనిపించారు. ఈ దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ రాకతో ఘాట్ పరిసరాలు అభిమానులతో కిక్కిరిశాయి. తారక్‌ను దగ్గరగా చూడాలని అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఓ అభిమాని తారక్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ కిందపడిపోయాడు. వెంటనే భద్రతా సిబ్బంది అతన్ని పక్కకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ముందుకు వచ్చి ఆ అభిమానితో షేక్ హ్యాండ్ ఇచ్చారు. దీంతో అక్కడున్న అభిమానులు ఆనందోత్సాహాలకు లోనయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానిపై తారక్ చూపించిన ఆప్యాయతకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. “స్టార్డమ్ ఎంత ఉన్నా అభిమానులను గౌరవించడం తారక్ ప్రత్యేకత” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఈ సందర్భంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని మహానేతకు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహానుభావుడని కొనియాడారు. భక్తులు, అభిమానులు భారీగా తరలిరావడంతో పోలీసులు ఘాట్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.ప్రతి ఏడాది ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి సందర్భంగా ఘాట్‌కు వచ్చి నివాళులు అర్పించడం జూనియర్ ఎన్టీఆర్ ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. తాతయ్యపై తనకున్న గౌరవాన్ని ఆయన మరోసారి చాటుకున్నారు.
NTR anna at NTR Ghat 🙏🏻❣️@tarak9999#JoharNTR #NTRliveson pic.twitter.com/5pgjJuj1j6
— Gajuwaka NTR Fans (@GajuwakaNTRfc) May 28, 2026