Rajinikanth | భారతీయ సినీ పరిశ్రమలో తనదైన స్టైల్, మాస్ మేనరిజమ్స్‌తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ జీవిత ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. స్టార్డమ్ శిఖరాలను అధిరోహించినా, తన మూలాలను ఎప్పటికీ మర్చిపోని వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పాత ఐడెంటిటీ కార్డ్ మరోసారి రజనీకాంత్ సాధారణ జీవితం నుంచి అసాధారణ స్థాయికి ఎదిగిన ప్రస్థానాన్ని గుర్తు చేస్తోంది. తాజాగా బయటకు వచ్చిన ఈ బ్లాక్ అండ్ వైట్ ఐడీ కార్డు.. రజనీకాంత్ బెంగళూరు ట్రాన్స్పోర్ట్ సర్వీస్‌లో బస్సు కండక్టర్‌గా పనిచేసిన రోజుల నాటిదిగా చెబుతున్నారు. ఈ కార్డుపై ఆయన అసలు పేరు ‘శివాజీ రావు గైక్వాడ్’ అని స్పష్టంగా ముద్రించి ఉండటం అభిమానులను ఆకట్టుకుంటోంది.
అలాగే కండక్టర్ బ్యాడ్జ్ నంబర్ కూడా అందులో కనిపిస్తోంది. అప్పట్లో బెంగళూరులో నడిచే ‘రూట్ నంబర్ 10A’ బస్సులో రజనీకాంత్ విధులు నిర్వహించేవారని ఈ వివరాల ద్వారా తెలుస్తోంది. బస్సు కండక్టర్‌గా పనిచేసే రోజుల్లోనే రజనీకాంత్ తన ప్రత్యేక స్టైల్‌తో అందరి దృష్టిని ఆకర్షించేవారని ఆయన పాత స్నేహితులు చెబుతుంటారు. టిక్కెట్లు ఇచ్చే తీరు, విజిల్ వేయడం, గాల్లోకి నోట్లను విసురుతూ టిక్కెట్లు చించడం, ప్రయాణికులతో సరదాగా మాట్లాడటం వంటి మేనరిజమ్స్ అప్పట్లోనే ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. అదే స్టైల్ తర్వాత వెండితెరపై ఆయనకు అపారమైన క్రేజ్‌ను తెచ్చిందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
సినీ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత రజనీకాంత్ వెనుదిరిగి చూసుకోలేదు. తమిళ చిత్రసీమలో స్టార్ హీరోగా ఎదిగిన ఆయన.. తర్వాత భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో ఒకరిగా నిలిచారు. కోట్లాది రూపాయల పారితోషికం అందుకుంటున్నా, తన గతాన్ని మాత్రం ఎప్పటికీ మరచిపోలేదు. ప్రత్యేకంగా తన కష్టకాలంలో అండగా నిలిచిన బస్సు డ్రైవర్, స్నేహితుడు రాజ్ బహదూర్‌ను రజనీకాంత్ ఎన్నో సందర్భాల్లో గుర్తు చేసుకుంటుంటారు. కొన్ని నెలల క్రితం ఆయన ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా బెంగళూరులోని జయనగర్ బీఎంటీసీ బస్ డిపోను సందర్శించడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. అక్కడ పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లను ఆప్యాయంగా పలకరించి, వారితో ఫోటోలు దిగిన రజనీకాంత్ తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.