ఖలీల్‌వాడి, ఆగస్టు 11: గురుకుల విద్యాలయాలు అరకొర వసతులతో అస్తవ్యస్తంగా నడుస్తున్నాయి. అద్దె భవనాల్లో కొనసాగుతున్నా పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉన్నది. అద్దె భవనాల్లో నడుస్తున్న ఒక్కో గురుకుల విద్యాలయానికి ప్రతి నెలా సుమారు రూ.లక్షా60వేలు ప్రభుత్వం చెల్లిస్తున్నా.. సౌకర్యాలు నామమాత్రంగానే కనిపిస్తున్నాయి. నవీపేట మండలానికి కేటాయించిన తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల నిజామాబాద్ నగరంలోని ప్రశాంతి హోమ్స్‌లో నిర్వహిస్తున్నారు. ఈ గురుకుల పాఠశాలకు గత కేసీఆర్ ప్రభుత్వం స్థల సేకరణ చేయగా, కొత్తగా వచ్చిన ప్రభుత్వం చొరవ తీసుకొని భవనాన్ని నిర్మించాల్సి ఉంది. కానీ, నిర్మాణ పనులు ప్రారంభించకపోవడంతో అద్దె భవనంలో కొనసాగుతున్నది.
నిజామాబాద్ అర్బన్‌కి చెందిన మహాత్మా జ్యోతి భా ఫూలే బీసీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాలను దాస్‌నగర్‌లో ఓ అద్దె భవనంలో నడుపుతున్నారు. ఇక్కడ సుమారు 800 మంది విద్యార్థినులు చదువుతున్నారు. వారం రోజులుగా బోరు మోటారు చెడిపోవడంతో నీటి సమస్యతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తినడానికి సరైన బియ్యం పంపిణీ చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మౌలిక సదుపాయాలపై అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. 800 మంది విద్యార్థినులు ఉన్న చోట సరైన మైదానం లేదు. చుట్టూ పంట పొలాల మధ్యలో ఈ భవనం ఉన్నది. ఇదిలా ఉండగా 15రోజుల క్రితం తల్లిదండ్రుల సందర్శన సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థినితోపాటు విద్యార్థినులకు చెందిన ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే.
మోపాల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మొత్తం 530 మంది విద్యార్థినులు చదువుతున్నారు. పెద్ద మొత్తంలో ఉన్న విద్యార్థినులందరికీ కలిపి 16 వాష్‌రూమ్‌లు మాత్రమే ఉన్నాయి. దీంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.
వానకురిస్తే వర్షపు నీరు, డ్రైనేజీ వాటర్ మైదానంలోకి చేరుతుంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ వర్షపు నీటితో ఇబ్బందులు పడుతున్నాం. అద్దె భవనం కావడంతో యజమానికి పలుమార్లు చెప్పాము..స్పందించకపోవడంతో ఉన్నతాధికారులకు నివేదించాం.
– స్వప్న, ప్రిన్సిపాల్, బీసీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల, దాస్‌నగర్