నిజాంసాగర్, డిసెంబర్ 7: మండలంలోని అచ్చంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బిచ్కుంద మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన అజయ్(17) ఆదివారం మధ్యాహ్నం నిజాంసాగర్ ప్రాజెక్టు 16 గేట్ల కింది భాగంలో నీటిలో మునిగి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. రాజాపూర్ గ్రామానికి చెందిన గొట్టం బాలయ్య-హన్మవ్వ దంపతులకు ముగ్గురు కుమారులు పెద్ద కుమారుడు అంజి మొబైల్ దుకాణం నిర్వహిస్తుండగా రెండో కుమారుడు అజయ్ అచ్చంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో ఇంటర్ సీఈసీ మొదటి సంవత్సరంలో చేరగా.. ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతున్నాడు.
మూడో కుమారుడు భరత్ పదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో ఉదయం టిఫిన్ తిన్న అనంతరం బయటికి వెళ్తామని తరగతి ఇన్చార్జిగా ఉన్న రవికాంత్ అనే ఉపాధ్యాయుడిని అడిగాడు. అతడు అనుమతి ఇవ్వకపోవడంతో అనంతరం రవికాంత్‌కు తెలియకుండా మరో ఉపాధ్యాయుడు లక్ష్మయ్య అనుమతి తీసుకొని అజయ్‌తోపాటు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అఖిల్, ఆశీష్, అభిలాశ్, మయూర్ కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లారు. అజయ్ ఒక్కడే ప్రాజెక్టు కింది భాగంలోని నీటిలో స్నానం చేసేందుకు దిగాడు.
ఈత రాక నీటిలో మునిగాడు. వెంట వచ్చిన వారు ఒడ్డుకు చేర్చారు. ప్రథమ చికిత్స చేసినా.. అతడు అప్పటికే మృతిచెందాడు. ఇద్దరు అక్కడే ఉండగా.. మరో ఇద్దరు గురుకుల పాఠశాలకు వెళ్లి విషయాన్ని అధ్యాపకులకు తెలిపారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్‌తో పాటు ఉపాధ్యాయులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై శివకుమార్ అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా దవాఖానకు తరలించారు.
విషయం తెలుసుకున్న అజయ్ అన్న అంజితోపాటు వారి బంధువులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అజయ్ నీటిలో పడి మృతి చెందాడా..? లేక వెంట వచ్చిన మిత్రులతో గొవడ కారణంగా మృతి చెందాడా..? అంటూ రోధించారు. తమకు న్యాయం చేయాలని, గురుకుల పాఠశాలలో సీసీ పుటేజీని పరిశీలించి ఎంత మంది బయటికి వెళ్లారు..? అసలు కారణం ఏమిటో విచారణ చేపట్టి సరైన న్యాయం చేయాలని కోరారు.
అచ్చంపేట ఎస్సీ గురుకుల పాఠశాల నిర్వహణ పూర్తిగా గాడితప్పింది. ఇక్కడ విధులు నిర్వహించే ఉపాధ్యాయులు మొదలుకొని పని చేసే ఉద్యోగులు విధులు సక్రమంగా నిర్వహించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వకుండా ఇష్టం వచ్చినప్పుడు కిటికీ రాడ్లను తొలగించి బయటికి వెళ్లడం, మళ్లీ ఎవరికీ తెలియకుండా రావడం వంటివి కొనసాగుతున్నాయని విద్యార్థులే తెలియజేస్తున్నారు. సిగరెట్, తంబాకు తీసుకువచ్చేందుకు ఉపాధ్యాయులు తమను బయటికి పంపుతున్నారని వాపోయారు.
సుమారు సంవత్సరం కిందటే ఓ ఉపాద్యాయుడిపై పోక్సో కేసు నమోదు కావడం, నెల రోజుల కిందటే గురుకుల పాఠశాలను సందర్శించిన మండల ప్రత్యేకాధికారి అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గురుకుల పాఠశాలలో ఓ ఉద్యోగి అంతా తానే అన్న విధంగా వ్యవహరించడంతోనే ఇలాంటి పరిస్థితి తలెత్తుతున్నదని ఉపాధ్యాయులు సైతం వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని గురుకుల పాఠశాల నిర్వహణను చక్కదిద్దాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.