కంఠేశ్వర్, మార్చి 21: మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు. బాన్సువాడ నియోజకవర్గం నుంచి నిజామాబాద్ కలెక్టరేట్‌కు భారీగా తరలివచ్చిన కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వడం లేదని, పనుల విషయంలోనూ సతాయిస్తున్నారని మండిపడ్డారు. సుమారు 400 మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలు పోచారం డౌన్‌డౌన్ అని నినాదాలతో హోరెత్తించారు. పోలీసులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అడిషనల్ కలెక్టర్ కిరణ్‌కుమార్ వచ్చి మాట్లాడడంతో కాంగ్రెస్ నేతలు శాంతించారు.
బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన ఓ కాంట్రాక్టర్ గుండెపోటుతో మృతి చెందాడు. అయితే, కాంట్రాక్ట్ పనులు, నిధుల మంజూరు విషయంలో ఒత్తిడికి గురై అతడు గుండెపోటుకు గురయ్యాడని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ శ్రేణులు అంబులెన్స్‌లో మృతదేహాన్ని తీసుకుని నిజామాబాద్ కలెక్టరే ట్‌కు వచ్చారు. అయితే, పోలీసులు మృతదేహాన్ని అంబులెన్స్ నుంచి బయటికి తీయకుండా అడ్డుకున్నారు. అలా చేయడం సరికాదని చెప్పడంతో కార్యకర్తలు కలెక్టరేట్ గేటు ఎదుట ధర్నాకు దిగారు.
అనంతరం అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్‌ను కలిసిన అధికార పార్టీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. నియోజకవర్గానికి మంజూరైన అభివృద్ధి పనులను గ్రామసభల ద్వారానే కేటాయించేలా చూడాలని కోరా రు. ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులను అధికారులు ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారన్నారు. గ్రామసభలు నిర్వహించకుండా పనులు చేపడుతున్నారన్నా రు. పనులు నిర్వహించే ఏజెన్సీలను నిర్ణయించే విధానాలు కూడా గ్రామసభ తీర్మానాలు చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా కేటాయిస్తున్నారని తెలిపారు.