ఖలీల్‌వాడీ, జూలై 1: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ శనివారం నిర్వహించిన గ్రూప్-4 నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో సగటున 82 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. మొత్తం 39174 మంది అభ్యర్థులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగిన మొదటి సెషన్ పేపర్ 1పరీక్షకు 32,342 మంది (82.55శాతం) హాజరైనట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన పేపర్-2కు 32,255 మంది (82.34శాతం) హాజరైనట్లు వివరించారు. నిర్ణీత సమయానికి 15 నిమిషాల ముందు పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేశారు.పరీక్ష ముగిసిన అనంతరం అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు ఇతర సామగ్రిని నిబంధనలకనునగుణంగా సీల్ వేసి పోలీస్ ఎస్కార్ట్ నడుమ స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించారు. ఈ ప్రక్రియను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల వద్ద అభ్యర్థుల కోసం హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు.
పరీక్షా కేంద్రాలను కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తనిఖీ చేశారు. శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల (మాణిక్‌భవన్), కాకతీయ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలను కలెక్టర్ సందర్శించి పరీక్ష నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించారు. అభ్యర్థుల హాజరుపై ఆరా తీశారు. అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ గూపన్‌పల్లిలోని శ్రీ చైతన్య హైస్కూల్లోని ఎగ్జామ్ సెంటర్‌ను సందర్శించారు.అభ్యర్థుల హాజరుపై పరీక్షా కేంద్రాల నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కామారెడ్డి, జూలై 1 : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గ్రూప్ 4 పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు అధికారులు తెలిపారు. జిల్లా కేంద్రంలో 40 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.మొత్తం 16,101 మంది అభ్యర్థులకు 13,988 (86.88 శాతం)మంది హాజరుకాగా, 2,113 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. పరీక్ష అనంతరం పత్రాలను పోలీసు బందోబస్తు మధ్య తరలించారు. పరీక్ష ప్రశాంతంగా జరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
నిజామాబాద్ క్రైం; జూలై 1: నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో శనివారం నిర్వహించిన గ్రూప్-4 పరీక్షా కేంద్రాలను ఇన్చార్జి పోలీస్ కమిషనర్ సీహెచ్.ప్రవీణ్ కుమార్ పర్యవేక్షించారు. నిజామాబాద్ డివిజన్లో 78, ఆర్మూర్ డివిజన్లో -25, బోధన్ డివిజన్ పరిధిలోని22 మొత్తం-125 పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సీపీతోపాటు అదనపు డీసీపీ, ఏసీపీలు ముగ్గురు, సీఐలు/ఆర్ఐలు 19 మంది, ఎస్సైలు, ఆర్ఎస్సైలు 48మంది, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్స్ 64, పోలీస్ కానిస్టేబుల్స్,హోమ్ గార్డులు140, మహిళా సిబ్బంది 83, ఇతర సిబ్బంది 48 మంది బందోబస్తులో విధులు నిర్వర్తించారు.