ఉన్నావ్: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో క్రికెటర్లపై తేనటీగలు దాడి(Bee Attack) చేశాయి. ఈ ఘటన బుధవారం సాయంత్రం జరిగింది. తేనటీగల దాడిలో 65 ఏళ్ల అంపైర్ మృతిచెందినట్లు కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్ బియరర్ తెలిపారు. శుక్లాగంజ్ ఏరియాలోని సప్రూ మైదాన్‌లో ఈ ఘటన జరిగింది. బీ అటాక్‌లో సుమారు 20 మంది క్రికెటర్ల వరకు కూడా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. కాన్పూర్‌కు చెందిన మానిక్ గుప్తా క్రికెట్ మ్యాచ్‌కు అంపైరింగ్ చేస్తున్నాడు. అయితే అకస్మాత్తుగా తేనటీగలు ప్లేయర్లు, అఫీషియల్స్పై దాడి చేశాయి. దీంతో మైదానంలో గందరగోళం ఏర్పడింది. తేనటీగల నుంచి తప్పించుకునేందుకు ఆటగాళ్లు, ప్రేక్షకులు పరుగులు తీశారు.
తేనటీగల దాడిలో అంపైర్ గుప్తాకు తీవ్ర గాయాలయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అక్కడే అతను స్పహృ కోల్పోయాడు. తొలుత అతన్ని శుక్లాగంజ్‌లో ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత అతన్ని కాన్పూర్‌లోని లాలా లజ్‌పత్ రాయ్ ఆస్పత్రికి తరలించారు. కానీ అతను మృతిచెందినట్లు డాక్టర్లు ద్రువీకరించారు. తేనటీగల దాడిలో మరో అంపైర్ కూడా గాయపడ్డారు. కాన్పూర్ క్రికెట్ సంఘం ప్రెసిడెఒంట్ ఎస్ఎన్ సింగ్ తన ప్రకటనలో అంపైర్ మానిక్ గుప్తా మృతిని ద్రువీకరించారు. గుప్తాను ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో అతని ముఖం, శరీరంపై ఇంకా తేనటీగలు పట్టుకుని ఉన్నట్లు చెప్పారు. అంపైర్ మృతి పట్ల కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు.