కంఠేశ్వర్/ కామారెడ్డి, నవంబర్ 17: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్-3 పరీక్షలు ఉమ్మడి జిల్లాలో ప్రారంభమయ్యాయి. మొదటిరోజైన ఆదివారం పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, కామారెడ్డి జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్ విజయ్‌కుమార్ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఆదివారం ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు నిర్వహించిన మొదటిసెషన్ పరీక్షకు నిజామాబాద్ జిల్లాలో మొత్తం 19,941 మంది అభ్యర్థులకు 10,037 (50.33 శాతం) మంది హాజరుకాగా.. 9904 మంది గైర్హాజరైనట్లు కలెక్టర్ వెల్లడించారు.
మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు నిర్వహించిన పరీక్షకు 19,992 మంది అభ్యర్థులకు 9,949 (50.10) మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్న గ్రూప్ -3 పరీక్షకు సంబంధించి కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అభ్యర్థులు నిబంధనలను తప్పకుండా పాటిస్తూ నిర్ణీత సమయానికి ముందే పరీక్షాకేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఉదయం 9.30 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేస్తారని, తర్వాత లోనికి అనుమతించబోరని స్పష్టంచేశారు.
కామారెడ్డి జిల్లాలో 20 కేంద్రాల్లో గ్రూప్-3 పరీక్ష నిర్వహించినట్లు రీజినల్ కో-ఆర్డినేటర్ విజయ్‌కుమార్ తెలిపారు.
ఉదయం మొత్తం 8,268 మంది అభ్యర్థులకు 4,655 (56.30 శాతం) మంది హాజరు కాగా 3,613 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 8,268 మంది అభ్యర్థులకు 4,644 (56.17 శాతం) మంది హాజరు కాగా.. 3,624 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఆర్మూర్‌టౌన్, నవంబర్17: పట్టణంలోని సెయింట్‌పాల్ హైస్కూల్లో గ్రూప్-3 పరీక్ష రాయడానికి ఓ మహిళా అభ్యర్థి వెంట తన కుమారుడిని తీసుకొని వచ్చింది. వెంట సంబంధీకులెవరూ లేకపోవడంతో బాబును తీసుకొని పరీక్షా కేంద్రంలోకి వెళ్లగా..అనుమతించలేదు. దీంతో అక్కడ డ్యూటీలో ఉన్న ఆర్మూర్ ఏఎస్సై సలీం చిన్నారిని ఎత్తుకున్నాడు. తండ్రి వచ్చాక బాబుని అప్పగించారు.