వరి సాగుచేస్తున్న రైతుల్లో టెన్షన్ మొదలైంది. భూగర్భ జలాలు తగ్గిపోయాయి. దీంతో బోర్లలో నుంచి నీరు సరిగా రావడం లేదు. పొలం తడపడం రైతులకు కష్టంగా మారింది. పంట చేతికి అందడానికి మరో నెల, నెలన్నర రోజులు పట్టే అవకాశం ఉన్నది. దీంతో అప్పటి వరకు పంటను ఎలా గట్టెక్కించుకోవాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండలు అప్పుడే తీవ్రంగా ఉండడంతో పొలాలు నెర్రెలు వాస్తున్నాయి.
మండంలోని లక్ష్మీసాగర్ తండా తదితర గ్రామాల్లో పొలాలు పారించేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు. కొందరు రైతులు సమీపంలో ఉన్న రైతుల బోరు బావుల నుంచి నీటిని పారిస్తున్నారు. కానీ ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పెట్టుబడి ఖర్చులు బాగా పెరిగాయని, పంట చేతికి రాకుంటే పరిస్థితి ఏమిటని దిగాలు చెందుతున్నారు. మండలంలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పనులు ఏడాదిగా కొనసాగుతున్నాయని, ఇప్పటికే పూర్తయితే నీటి తిప్పలు తప్పేవని అభిప్రాయపడుతున్నారు.
-చందూర్, మార్చి 5
నేను డిగ్రీ చదువుకొని ఉద్యోగం కోసం ప్రయత్నం చేశా. ఉద్యోగం రాకపోవడంతో మాకు లక్ష్మాపూర్ గ్రామ మాటు కాలువ తండా శివారులో ఉన్న ఎకరం భూమిలో పొలం సాగుచేస్తున్న. ప్రస్తుతం వరి పొట్ట దశలో ఉన్నది. బోరులో నీరు సరిగా రావడం లేదు. దీంతో పక్క పొలం అతడిని బతిమిలాడి రోజూ రాత్రి పొలానికి నీరు పారిస్తున్న. ఇంకో నెల రోజులు నీరు పారిస్తే తప్ప పొలం బయటపడే పరిస్థితి లేదు. ఏమవుతుందోనని ఆందోళనగా ఉన్నది.
-పాత్లోత్ వసంత్, ఘన్పూర్, యువరైతు
లిఫ్ట్ పనులు సంవత్సరం నుంచి సాగుతున్నాయి. అవి పూర్తయ్యే దెప్పుడో..? పంటలకు నీరు అందేది ఎప్పుడో..? మాకు లక్ష్మీసాగర్ తండాలో ఉన్న నాలుగు ఎకరాల్లో పొలం సాగుచేస్తున్న. ఎండలు మండుతున్నాయి. మరో నెల రోజుల్లో ఎండలు ఇంకా ముదురుతాయని అధికారులు అంటున్నరు. ప్రస్తుతం బోర్లలో అంతంతమాత్రంగానే నీరు వస్తున్నది. ఇప్పటికే పెట్టుబడి బాగా అయ్యింది.
-లకావత్ శంకర్, మేడ్పల్లి, రైతు