ఎల్లారెడ్డి రూరల్, జూన్ 17: ఎల్లారెడ్డిలో 50 ఎకరాల్లో ఐటీ కారిడార్ నిర్మించేందుకు గ్రీన్స్సిగ్నల్ పడిందని, ఆర్డీవో 50ఎకరాల స్థలం చూయించగానే ఐటీ కారిడార్ పనులు ప్రారంభమవుతాయని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదర్మోహన్రావ్ అన్నారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటి వరకు ఎన్నికలు, రాజకీయాలు మాట్లాడామని, ఎన్నికలు ముగిసినందున ఇకనుంచి ఎల్లారెడ్డి అభివృద్ధిపై ఫోకస్ పెడతామని, అభివృద్ధి పనులే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. రూ.వెయ్యి కోట్లతో ఎల్లారెడ్డిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే వరకు విశ్రమించబోనన్నారు.
లక్షలాది రూపాయలు వెచ్చించి పేదలు ప్రైవేటు దవాఖానల్లో చికిత్స తీసుకోలేరని, వారికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ దవాఖానల్లోనే కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలని ఎమ్మెల్యే మదన్మోహన్రావ్ సూచించారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ దవాఖానను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వార్డుల్లో తిరుగుతూ రోగులతో ముచ్చటించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దవాఖానలో తాగునీరు, సానిటేషన్, ఎక్స్ రే, సిబ్బంది కొరత తదితర సమస్యలు ఉన్నాయని, పరిష్కరించేందుకు వైద్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. అతి త్వరలోనే సమస్యలను పరిష్కరించి ఎల్లారెడ్డి ప్రభుత్వ దవాఖానను జిల్లాలోనే నంబర్ వన్ స్థానంలో నిలుపుతామన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రవీందర్ మోహన్, జడ్పీటీసీ ఉషాగౌడ్, నాయకులు ఉన్నారు.