కమ్మర్పల్లి, ఫిబ్రవరి 28: మనుమడిని వరదకాలువలో పడేసి హత్యచేసిన నగువోతుల గంగవ్వకు జీవిత కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల బుధవారం తీర్పు వెలువరించినట్లు కమ్మర్పల్లి ఎస్సై రాజశేఖర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలోని పెద్దమ్మ కాలనీకి చెందిన గంగవ్వ కుమారుడు గంగాధర్‌కు మూడున్నర సంవత్సరాల వయస్సు గల కుమారుడు లక్కీ ఉండేవాడు. గంగవ్వ చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవించేది. ఆమె భర్త చాలా రోజుల క్రితమే మృతి చెందాడు. గంగవ్వకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. పెద్దకొడుకు గంగాధర్ తన భార్య గంగామణిని దాంపత్య విషయంలో తలపై ఇటుకతో కొట్టి చంపినట్లు అభియోగాలతో జైలుకు వెళ్లి, బెయిల్‌పై తిరిగి వచ్చాడు.
గంగాధర్ కొడుకు లక్కీ పోషణను గంగవ్వ చూసుకునేది. 70ఏండ్ల వృద్ధురాలు కావడం, మనుమడు లక్కీ బాగోగులు భారంగా మారడంతో ఆ బాలుడిని చంపాలనుకున్నది. కొడుకు గంగాధర్ లేని సమయంలో మే 10, 2023న మధ్యాహ్నం చిత్తు కాగితాలు ఏరుకోవడానికి మనుమడిని వెంట తీసుకొని కమ్మర్పల్లి మండల కేంద్ర శివారులోని ఉప్లూర్ వెళ్లే రహదారిలో ఉన్న వరదకాలువలో పడేసింది. బాలుడు ఊపిరాడక మరణించాడనే హత్య అభియోగాలు కోర్టు నేర న్యాయ విచారణలో నిరూపణ అయినట్లు సెషన్స్ జడ్జి సునీత తీర్పులో పేర్కొన్నారని ఎస్సై వివరించారు. హత్యానేరం రుజువుకావడంతో గంగవ్వకు జీవిత కారాగార శిక్ష విధిస్తూ 14 పేజీల తీర్పు వెలువరించినట్లు తెలిపారు. పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవిరాజ్ ప్రాసిక్యూషన్ నిర్వహించగా పీపీకి సహాయకారిగా కమ్మర్పల్లి స్టేషన్ కానిస్టేబుల్ రామారావు ఉన్నారని చెప్పారు