కామారెడ్డి, మే 20: జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఈ నెల 24లోగా పూర్తి చేయాలని కామారెడ్డి,నిజామాబాద్ జిల్లాల ప్రత్యేకాధికారి డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ జితేశ్ వీ పాటిల్,అదనపు కలెక్టర్ చంద్రమోహన్ ఇతర అధికారులతో సోమవారం ఏర్పాటు చేసిన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా చేస్తున్నారని, రైస్‌మిల్లర్లు కూడా సహకరిస్తున్నారని ప్రశంసిస్తూ ఇదే స్ఫూర్తితో వచ్చే శుక్రవారంలోగా కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. కొనుగోళ్లు ముగిసిన 180కేంద్రాల సిబ్బంది, హమాలీ, తూకం యంత్రాలను వడ్లు ఎక్కువగా ఉన్న కేంద్రాలకు తరలించి త్వరితగతిన మిల్లులకు తరలించేలా చూడాలన్నారు. రోజుకు 10వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం తరలించేందుకు కొనుగోలు కేంద్రా లు పగలు,రాత్రి పనిచేసేలా చూడాలని సూచించా రు. కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో 350కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 2.64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 97శాతం ట్యాబ్ ఎంట్రీ పూర్తిచేసి 2.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి డబ్బులు చెల్లించామని వివరించారు. 230 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశామని, మిగిలిన 120 కేంద్రాల్లో శుక్రవారం నాటికి పూర్తిగా కొనుగోలు చేసేలా అధికారులతో మానిటరింగ్ చేస్తున్నామని తెలిపారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో డీఎస్వో మల్లికార్జున్‌బాబు, ఇన్చార్జి జిల్లా మేనేజర్ నిత్యానందం, వ్యవసాయాధికారిణి భాగ్యలక్ష్మి, సహకార శాఖ అధికారులు ప్రశాంత్ రెడ్డి, భూమయ్య, జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఐకేపీ, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.