నిజామాబాద్, అక్టోబర్ 6, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతులను వరుణ దేవుడు వెంటాడుతూనే ఉన్నాడు. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో కురిసిన అతి భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తెరపినచ్చిన వేళా కోలుకున్న రైతులకు ఇప్పుడు మరోసారి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పంట చేతికి వస్తోన్న సమయంలో కురుస్తోన్న భారీ వానలకు చేతికి దక్కకుండానే వడ్లు నేల రాలిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బాన్సువాడ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వరి కోతలు షురూ అయ్యాయి. రుద్రూర్, కోటగిరి, చందూర్, వర్ని, రెంజల్, ఎడపల్లితో పాటుగా బాన్సువాడ, నస్రుల్లాబాద్‌లో వడ్లను అమ్ముకునేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు. ఇందులో చాలా మంది సన్న వడ్లను ఇంటి అవసరాలకు సర్ది పెట్టుకుంటుండగా మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారు.
పలు చోట్ల అధికారికంగా ధాన్యం సేకరణ కేంద్రాలు ప్రారంభించినప్పటికీ తూతూ మంత్రంగానే సేకరణ కొనసాగుతుందని రైతులు వాపోతున్నారు. ఓ వైపు వర్షం ముప్పు వెంటాడుతున్న నేపథ్యంలో రైతులంతా ముందస్తుగానే పంటను కోయాలని నిర్ణయించుకుంటున్నారు. పచ్చి వడ్లను ఆరబోసుకున్న తర్వాత విక్రయించుకునేందుకు ఆలోచన చేస్తున్నారు. ఒకవేళ వాతావరణం సహకరించకపోతే సర్కారు సంసిద్ధంగా లేకపోతే ప్రైవేటు వ్యాపారులకైనా అమ్ముకునేందుకు సిద్ధపడుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో మొత్తం 15లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాలని పౌరసరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. గత సీజన్లో ఇబ్బందులు తలెత్తిన దృష్ట్యా ఈసారైనా సాఫీగా ధాన్యం సేకరణ జరుగుతుందా? లేదా? అనే ఆందోళన రైతులను వెంటాడుతోంది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో కాంగ్రె స్ హయాంలో ధాన్యం కొనుగోళ్లలో ఇక్కట్లు తప్పడం లేదు.
కామారెడ్డి జిల్లాలో 2025-26 వానకాలం సీజన్లో 80,031 ఎకరాల్లో దొడ్డురకం ధాన్యం పండించారు. 34,299 ఎకరాల్లో సన్నరకం ధాన్యాన్ని రైతులు సాగు చేశారు. మొత్తం 1,14,330 ఎకరాల్లో వరి సాగుకు నోచుకుంది. ఇందులో దొడ్డు రకం 5లక్షల 194 మెట్రిక్ టన్నులు, సన్నాలు లక్షా 88వేల 644 మెట్రిక్ టన్నులు కలిపి మొత్తం 6.88లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం వస్తుందని అంచనాలు సిద్ధమయ్యాయి. ఇందులో సన్న రకం ధాన్యం 71వేల 685 మెట్రిక్ టన్నులు స్థానిక అవసరాలకు, 18వేల 865 మెట్రిక్ టన్నులు మిల్లర్లు కొనుగోలు చేయగా మిగిలిన 5.98లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని పౌరసరఫరాల సంస్థ లక్ష్యంగా నిర్ణయించింది.
ధాన్యం కొనుగోళ్లకు ఈసారి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 207 ఐకేపీ సెంటర్లు, పీఏసీఎస్ సెంటర్లు 215 కలిపి మొత్తం 422 ఏర్పాటు చేయబోతున్నారు. సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) ఇచ్చేందుకు కామారెడ్డి జిల్లాలో 43 బాయిల్డ్ రైస్ మిల్లుల్లో 3.01లక్షల మెట్రిక్ టన్నులు కెపాసిటీ, 104 రా రైస్ మిల్లుల్లో 3.01 లక్షల మెట్రిక్ టన్నులు సామర్థ్యం కలిగి ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. కామారెడ్డి జిల్లాను ఈసారి అతి భారీ వర్షాలు తీవ్ర స్థాయిలో పంటలను దెబ్బతీసింది. చాలా చోట్ల పంట ఉత్పత్తులు ఘోరంగా పడిపోయే ప్రమాదం ఉంది. వ్యవసాయ శాఖ అంచనాల కంటే తక్కువే ధాన్యం వచ్చే వీలున్నట్లుగా తెలుస్తోంది. వరి పంట ఉత్పత్తిపై వరదల ప్రభావం పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉన్నప్పటికీ అంచనాల్లో తేడా లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
నిజామాబాద్ జిల్లాలో 2025-26 వానాకాలం సీజన్లో 18,546 ఎకరాల్లో దొడ్డు రకం వరి సాగైంది. 1,58,178 ఎకరాల్లో సన్న రకం కలిపితే మొత్తం 1,76,724ఎకరాల్లో వరి పంట సాగుకు నోచుకుంది. నిజామాబాద్ జిల్లాలో వరదలు, నీటి వసతి, ఇతరత్రా సౌకర్యాల అంచనాల మేరకు హెక్టార్ విస్తీర్ణానికి దొడ్డు రకం 7.147 మెట్రిక్ టన్నులు, సన్నరకం 7.127 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి సాధ్యం అయ్యే వీలున్నట్లుగా వ్యవసాయ శాఖ అంచనాల్లో తెలిపింది. ఈ మేరకు దొడ్డు రకం 1,32,550 మెట్రిక్ టన్నులు, 11,27,328 మెట్రిక్ టన్నులు సన్న రకం ధాన్యం కలిపితే మొత్తం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 12.59లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వచ్చే వీలున్నట్లుగా అంచనాలు సిద్ధమయ్యాయి.
ఇందులో స్థానిక అవసరాలకు 56,091 మెట్రిక్ టన్నులు, ప్రైవేటు కొనుగోళ్లు 3,03,786 మెట్రిక్ టన్నులు పోగా 9లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం పీఏసీఎస్ ఆధ్వర్యంలో అత్యధికంగా 392, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 22, ఐకేపీ సెంటర్లు 207, ఎఫ్‌పీవో 1, మెప్మా ఆధ్వర్యంలో 11 సెంటర్లు కలిపితే మొత్తం జిల్లా వ్యాప్తంగా 633 కొనుగోలు కేంద్రాలు తెరవాలని నిర్ణయించారు. నిజామాబాద్ జిల్లాలో బాయిల్డ్ రైస్ మిల్లులు 55 ఉండగా వీటి సామర్థ్యం 3.42లక్షల మెట్రిక్ టన్నులు, 197 రైస్ మిల్లుల్లో 5.08లక్షల మెట్రిక్ టన్నులు మిల్లింగ్ సామర్థ్యం కలిగి ఉన్నట్లుగా గుర్తించారు.