ఖలీల్‌వాడి, జనవరి 28: అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన.. రూ.22 కోట్లతో కంఠేశ్వర్ వద్ద నూతనంగా నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జిని ప్రారంభించారు. పాత కలెక్టరేట్ వద్ద రూ.50కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఇందూరు కళాభారతి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రసాధన కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో యావత్ తెలంగాణకు నిజామాబాద్ జిల్లా మార్గదర్శకంగా నిలిచిందని గుర్తుచేశారు. అందుకే ఈ ప్రాంతంపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానమన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం ఇటీవలే సమీక్ష నిర్వహించారన్నారు.
ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. ఇందులో భాగంగానే కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, బాలలు, అన్నివర్గాల ప్రజలకు చక్కటి కానుక అందించేలా ఇందూరు కళాభారతి నిర్మాణానికి రూ.50కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అన్ని హంగులు, ఆధునాతన వసతులతో అలరారేలా కళాభారతిని డిజైన్ చేశారని చెప్పారు.
మంత్రి కేటీఆర్‌కు ఘనస్వాగతం
అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిపేందుకు శనివారం జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి కేటీఆర్‌కు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి హెలికాప్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ చేరుకోగా, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్, బోధన్ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, షకీల్ ఆమేర్‌లు మంత్రి వెంట హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వచ్చారు.
హెలిప్యాడ్ వద్ద రాజ్యసభ సభ్యుడే కెఆర్.సురేశ్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రావు, వీజీగౌడ్, మేయర్ దండు నీతూకిరణ్, కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ నాగరాజు, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ చైర్మన్ గంగారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్ తదితరులు మంత్రికి మొక్కలు, పుష్పగుచ్ఛాలు అందించి ఘనస్వాగతం పలికారు.