నిజామాబాద్, జూలై 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ జిల్లాలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్(యూఆర్ఎస్), మోడల్ స్కూళ్లకు అనుబంధం చేయబడిన కేజీబీవీలు, మైనార్టీ గురుకులాల్లో కూరగాయలు, పండ్లు, మటన్, చికెన్ సరఫరాకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. ఇందుకు సంబంధించి జూన్ 18న టెండర్ ప్రకటన జారీ అయ్యింది. నిబంధనల ప్రకారం సరఫరాదారులను గుర్తించి వారికి పనులు అప్పగించాలి. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఎంపిక చేపట్టాల్సి ఉంటుంది. టెండర్ ప్రకటనలో పేర్కొన్న తేదీల మేరకు గత నెల 23వ తేదీ నాటికే దరఖాస్తుల స్వీకరణ ముగిసింది.
మరుసటి రోజు 24వ తేదీన ఉదయం 11గంటలకు అదనపు కలెక్టర్(రెవెన్యూ) ఛాంబర్లో సీల్డ్ టెండర్లు ఒపెన్ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ప్రక్రియ పూర్తి కాలేదు. 19 తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజీలకు సైతం ప్రకటన వచ్చింది. జూన్ 27న చేపట్టాల్సిన కేటాయింపులు జరగలేదు. జూన్ 30న అదనపు కలెక్టర్(రెవెన్యూ) కిరణ్ కుమార్ పదవీ విరమణ చేశారు. ఆయన సమక్షంలో జరగాల్సిన కార్యక్రమం అనివార్య కారణాలతో వాయిదా పడింది. లోకల్ బాడీ అదనపు కలెక్టర్ భుజంగరావుకు రెవెన్యూ అదనపు కలెక్టర్గా బాధ్యతలు అప్పగించారు. నెల రోజులు పూర్తి కావస్తున్నా ఇందుకు సంబంధించిన ప్రక్రియలో జాప్యం నెలకొంటున్నది.
ఆయా విద్యాలయాలకు టెండర్లలో జరుగుతోన్న తతంగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాలకు భిన్నంగా ఉండడం చర్చనీయాంశం అవుతోంది. కొంత మంది సరఫరాదారులు అనధికారికంగా నీకిది… నాకిది… అంటూ పంపకాలు పూర్తి చేసుకున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. టెండర్లలో పాల్గొనేందుకు ముందస్తుగానే ఒప్పందాలు చేసుకుని రావడం వివాదాస్పదం అవుతోంది. టెండర్ ఖరారుకై మొదటిసారి నిర్వహించిన మీటింగ్ అర్ధాంతరంగా రద్దు అయ్యింది. జూలై మూడో వారంలో జరుగుతుందని భావించిన సమావేశమూ వాయిదా పడింది. ఇలా తాత్సారం జరగడం తప్పా ప్రక్రియకు ముగింపు పలకడం లేదు.
సరఫరాదారుల్లోని కొంత మందికి అనధికారికంగా విద్యాలయాల పంపకాలు జరుగుతుండడం ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. తద్వారా పారదర్శకతకు పాతర పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని వాపోతున్నారు. పంపకాల పద్ధతులకు అవకాశం కల్పిస్తే భవిష్యత్తులో విద్యార్థులకు అందే నాణ్యమైన భోజనం పగటి కలగానే నిలిచే పోయే ప్రమాదం ఉందన్న వాదన వినిపిస్తోంది. టెండర్ ప్రక్రియ ఖరారుకై నిర్వహించిన తొలి సమావేశంలో అవాక్కు తినే అంశం మరోటి వెలుగు చూసిందని సరఫరాదారులు చెబుతున్నారు. గడువులోపు సమర్పించే దరఖాస్తులు, వాటి తో సమర్పించిన అర్హత పత్రాలనే ప్రామాణికంగా తీసుకోవడం ఎక్కడైనా షరామామూలే. కానీ పత్రాలు మార్చుకునేందుకు అవకాశం కల్పించడం వివాదాస్పదం కావడంతో పాటుగా చిందర వందర అన్నట్లుగా మారింది. ఉన్నతాధికారులు దృష్టి పెట్టి పారదర్శకతతో ప్రక్రియను చేపట్టాలని సంబంధీకులు కోరుతున్నారు.
మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో కూరగాయలు, పండ్లు, మటన్, చికెన్ సరఫరాకు సంబంధించిన టెండర్ ప్రక్రియను నిబంధనల మేరకు చేపడతాం. అనధికారికంగా ఎవరైనా ముందే విద్యాలయాలను పంపకాలు చేసుకుంటే వాటిని పరిగణలోకి తీసుకోం. అలాంటి వాటిని ఉపేక్షించబోం. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి పేద విద్యార్థులకు న్యాయం జరిగే విధంగానే కృషి చేస్తాం.
– భుజంగరావు, నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్