రెంజల్, జూలై 26: మండలంలోని రెంజల్, వీరన్నగుట్ట గ్రామాల్లో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు శుక్రవారం పర్యటించారు. ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల మరమ్మతు పనులను, ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రాన్ని పరిశీలించారు. రెంజల్ గ్రామానికి చెందిన సాయిలు తనకు సబ్సిడీ గ్యాస్ డబ్బులు ఖాతాలో జమకావడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. ప్రజాపాలన దరఖాస్తుల్లో సాంకేతిక సమస్యలు వస్తే తన దృష్టికి తీసుకురావాలని, ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకొంటూ ఇబ్బంది పెట్టొద్దని ఎంపీడీవోకు కలెక్టర్ సూచించారు. వీరన్నగుట్ట, రెంజల్ గ్రామాల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు నత్తనడకన సాగడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
వీరన్నగుట్ట పాఠశాలలో బోధన, విద్యార్థులకు మౌలిక వసతులపై కలెక్టర్ ఆరా తీశారు. పాఠశాలల సమయంలో కందకుర్తి, తాడ్‌బిలోలికి నిజామాబాద్-2 డిపో అధికారులు బస్సులు నడపక పోవడంతో పాఠశాలకు ఆలస్యం అవుతోందని, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని విద్యార్థులు కలెక్టర్‌కు చెప్పారు. రెంజల్లో మిషన్ భగీరథ తాగునీరు రావడంలేదని పలువురు ఫిర్యాదు చేయడం, పీహెచ్సీ, ప్రాథమిక పాఠశాలలో పిచ్చి మొక్కలు కనిపించడంతో కలెక్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీవో, ఎంపీవోను కలెక్టర్ ఆదేశించారు. రెంజల్ ప్రాథమిక పాఠశాలలో శిథిలావస్థలో ఉన్న గదులు కూలి విద్యార్థులకు ప్రమాదం జరిగే వరకు వాటిని కూల్చివేయరా అంటూ ఎంఈవోపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను వారంలో రెండు రోజులు తనిఖీ చేయాలని మండల ప్రత్యేక అధికారి వాజిద్ హుస్సేన్‌ను ఆదేశించారు. వన మహోత్సవంలో భాగంగా రెంజల్ ఆదర్శ, ప్రాథమిక పాఠశాలల ఆవరణలో నాటిన మొక్కలకు నీరు పోశారు. వాటిని కాపాడుకోవాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట డీఏవో వాజిద్‌హుస్సేన్, డీఆర్డీవో సాయాగౌడ్, పీఆర్‌ఈఈ శంకర్‌నాయక్, ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ శ్రావణ్‌కుమార్, పీఆర్ డీఈ రాజయ్య, ఎంఈవో గణేశ్‌రావు, ఏవో లక్ష్మీకాంత్‌రెడ్డి, ప్రిన్సిపాల్ బలరాం తదితరులు ఉన్నారు.