బోధన్, జూలై 8: బోధన్ డివిజన్లోని లక్ష్మీసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు న్యా య స్థానం ఊరట కల్పించింది. బాధిత రైతులకు న్యాయం చేయకపోవడాన్ని తప్పుపట్టిన న్యాయస్థానం బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయ ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర సర్కార్‌లో కదలిక వస్తుం దా అనే అనుమానం రైతులను వెంటాడుతున్నది. నాలుగు దశాబ్దాలుగా పరిహారం అందక ప్రాజెక్టు భూనిర్వాసితులు ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చారు.
1986లో అప్పటి భూసేకరణ అధికారి నిర్ణయించిన పరిహారం చాలా తక్కువగా ఉండడంతో, పరిహారాన్ని రెట్టింపుచేయాలని రైతులు బోధన్ సబ్ కోర్టును, అనంతరం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో రైతులకు అనుగుణంగా తీర్పు వచ్చినప్పటికీ, పరిహారం రాలేదు. ఇప్పటికీ రైతులకు పరిహారం చెల్లించకపోవడంతో.. బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయ ఫర్నిచర్ జఫ్తునకు బోధన్ సీనియర్ సివిల్ జడ్డి కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. ఈ ఆదేశాలు జిల్లా అధికార యంత్రాంగాన్ని కలవరానికి గురిచేశాయి. కోర్టు ఆదేశాలు త్వరగా అమలయ్యే అవకాశం ఉండగా, ఇది పాలకులకు ఒకింత అవమానకరమే అని భావించవచ్చు. సబ్ కలెక్టర్ కార్యాలయ ఆస్తుల జఫ్తు ఆదేశాలు అమలయ్యేలోగా ప్రభుత్వం స్పందించి తాము కోల్పోయిన భూములకు పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్చేస్తున్నారు.
ఉమ్మడి వర్ని మండలం.. ఇప్పటి చందూర్ మండలం పరిధిలో 1986 లో ప్రాజెక్టు నిర్మాణం, కాలువల త వ్వకం కోసం 105 మంది రైతులకు చెందిన 155 ఎకరాలను సేకరించా రు. ఒక్కో ఎకరానికి కేవలం రూ. 9 వేల పరిహారాన్ని నిర్ణయించారు. ఇంత తక్కువ పరిహారం చెల్లించడం అన్యాయమని రైతులు పలుసార్లు అప్పటి సర్కార్‌కు విన్నవించినా పట్టించుకోలేదు. దీంతో ఎకరానికి ఇచ్చే పరిహారాన్ని రూ.18 వేలకు పెంచి ఇప్పించాలంటూ బోధన్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు (సబ్ కోర్టు)ను ఆశ్రయించారు. సబ్ కోర్టులో సుమారు పదేండ్లపాటు ఈ విషయమై విచారణ జరిగి 1996లో తీర్పు వెలువడింది.
ఎకరానికి రూ.18 వేల చొప్పున పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్‌చేస్తూ అప్పటి ప్రభు త్వం హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లింది. హైకోర్టు కేసు విచారణలో ఉన్నందున.. పరిహారంలో సగం మొత్తాన్ని అంటే ఎకరానికి రూ.9 వేలు రైతులకు చెల్లించాలని చెప్పడంతో.. ఆ మొ త్తాన్ని ప్రభుత్వం చెల్లించింది. హైకోర్టులో సుమారు రెండు దశాబ్దాలపా టు కేసు విచారణలో ఉండిపోయింది. తర్వాత కింది కోర్టు తీర్పును సమర్థిస్తూ.. ఎకరానికి రూ.18 వేల చొప్పున పరిహారాన్ని వడ్దీతో సహా ఇవ్వాలని తీర్పు ఇచ్చింది.
40 ఏండ్లుగా లక్ష్మాపూర్ ప్రాజెక్ట్ భూ ముల పంచాయితీ తెగలేదు. కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. హైకోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా.. ఇప్పటి వరకూ పరిహారం రాలేదు. ఇప్పు డు బోధన్ కోర్టు సబ్ కలెక్టర్ కార్యాలయం ఆస్తులను జఫ్తుచేయాలని తీర్పు ఇవ్వడం సంతోష కరం. ఇప్పటికే పెద్ద మనుషులు ఎంతో మంది ఈ తీర్పును చూడకుండానే చనిపోయారు. మా తండ్రి రాములు కూడా కాలం చేసిండు. మాకు నాలుగు ఎకరాల పొలం లక్ష్మాపూర్ ప్రాజెక్ట్‌లో పోయింది..
-ఇల్తెపు భుజంగం, రైతు, లక్ష్మాపూర్ గ్రామం, చందూర్ మండలం
సుమారు 40 ఏండ్లకు మా భూముల పరిహారం కేసు లో తీర్పు వచ్చింది. ఒక పక్క మాకు సంతోషంగా ఉ న్నా.. ఇప్పుడు ఇస్తున్న పరిహారంతో భూములు కొనలేం.. అప్పట్లోనే పరిహారం మాకు వచ్చి ఉంటే.. అప్పుడే మరోచోట భూముల్ని కొనేవాళ్లం.. ఇంతకాలానికి పరిహారం వస్తున్నప్పటికీ, భూముల రేట్లు పెరిగిపోయాయి. అప్పట్లో చెరువు నిర్మాణం కోసమని సాగుభూములను ఇచ్చినం.
-ముద్దసాని గంగారాం, రైతు, లక్ష్మాపూర్
లక్ష్మీసాగర్ రైతులకు హైకోర్టు తీర్పును అనుసరించి పరిహారం చెల్లింపునకు కలెక్టర్‌కు నా లుగు నెలల క్రితమే ప్రతిపాదనలు పంప గా, వాటిని కలెక్టర్ ప్రభుత్వానికి పంపించారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తుంది. ప్రభుత్వం ఇందుకు బడ్జెట్ రిలీజ్ చేయగానే రైతులకు డబ్బులు అందుతాయి.
-వికాస్ మహతో, సబ్ కలెక్టర్, బోధన్