అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమైందని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మారుమూల తండాలు సైతం ప్రగతిబాట పట్టాయని తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి కేసీఆర్ సర్కారు అనేక పథకాలు అమలుచేస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వర్ని, బాన్సువాడ మండలాల్లో గురువారం పర్యటించిన స్పీకర్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
వర్ని, సెప్టెంబర్ 28: కేసీఆర్ హయాంలోనే రాష్ట్రంలోని తండాలు అభివృద్ధి సాధించాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వర్ని మండలం అంతాపూర్ తండాలో రూ.10లక్షల వ్యయంతో నిర్మించిన ఎస్టీ కమ్యూనిటీ హాలు, రూ.10లక్షల వ్యయంతో నిర్మించిన సేవాలాల్ మహరాజ్ ఆలయ ప్రహరీ, రూ.9లక్షల వ్యయంతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని గురువారం ప్రారంభించారు. అనంతరం పొట్టి గుట్ట తండాలో రూ.10లక్షల వ్యయంతో నిర్మించిన హనుమాన్, సేవాలాల్ మహరాజ్ ఆలయాల ప్రహరీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా తండావాసులతో మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడా లేనివిధంగా ఎక్కువ మందికి పోడు భూముల పట్టాలను కేవలం పొట్టి గుట్ట తండా లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు.ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను గిరిజనులు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలని కోరారు. అనంతరం మండల కేంద్రంలో కొనసాగుతున్న ప్రభుత్వ దవాఖాన భవన నిర్మాణ పనులను స్పీకర్ పరిశీలించారు. కార్యక్రమంలో వర్ని మండల కో-ఆప్షన్ సభ్యుడు కరీం, ఏఎంసీ వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, సర్పంచులు పద్మా జగ్రాం, శోభా యోగేశ్, బీఆర్ఎస్ నాయకులు కల్లాలి గిరి, ఎంబడి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడలో గ్రంథాలయ భవన నిర్మాణానికి భూమిపూజ
బాన్సువాడ/ బాన్సువాడ టౌన్, సెప్టెంబర్ 28: గ్రంథాలయ భవన నిర్మాణ పనులను నాణ్యతో చేపట్టాలని, లేకుంటే చర్యలు తప్పవని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఆయన జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్తో కలిసి బాన్సువాడ పట్టణంలో రూ.40 లక్షలతో చేపట్టనున్న భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. మినీ స్టేడియంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయంలో సమస్యలను పలువురు విద్యార్థులు స్పీకర్ పోచారం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పరిష్కరించాలని పీఏ భగవాన్ రెడ్డి కి స్పీకర్ సూచించారు
కేటీఆర్ పర్యటన ఏర్పాట్ల పరిశీలన
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వచ్చే నెల 4న బాన్సువాడకు రానున్నారు. పట్టణంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.