నిజామాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అన్నదాత సంక్షేమంపై పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వారి సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నారు. యాసంగి పంటను అమ్ముకోవడానికి నానా పాట్లు పడుతున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కొనుగోళ్ల ప్రక్రియలో జాప్యం నెలకొనడంతో కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ధాన్యం కుప్పలు పేరుకుపోగా..అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఒకవేళ ధాన్యం అమ్ముకున్నా రైలు మిల్లులకు తరలించడంలోనూ ఇబ్బందులు తప్పడంలేదు. ఇదిలా ఉండగా హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సీఎంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అనేక మంది హాజరయ్యారు. రూ.కోట్లు ఖర్చు పెట్టి నిర్వహిస్తున్న అందాల పోటీలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని భావిస్తున్న సర్కారు.. రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో కొన్నిరోజులుగా ధాన్యం కొనుగోళ్ల తీరును నిరసిస్తూ రైతులు ఎక్కడికక్కడ రోడ్డు ఎక్కి ఆందోళనలు చేస్తున్నారు. ధాన్యం కొనాలంటూ గర్జిస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కారు తీరుపైనా మండిపడుతున్నారు. కొద్ది మంది రైతు భరోసా రాలేదంటూ వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. మాఫీ చేస్తామని చెప్పిన పంట రుణాల సంగతి ఏదంటూ ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన హామీలను అటకెక్కించిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై రైతులు మండిపడుతున్నారు. రైతు భరోసా, రుణమాఫీ, ధాన్యానికి బోనస్ సంగతిపై అడిగితే సమాధానం ఇచ్చే వారు కరువయ్యారు.
బోనస్ ఎక్కడ?
ఉమ్మడి జిల్లాలో సుమారు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. వడ్లు అమ్ముకున్న రైతులకు వారం రోజుల్లో కనీస మద్దతు ధరకు ధాన్యం డబ్బులు నేరుగా వారి ఖాతాల్లో జమవుతున్నాయి. సన్న వడ్లు విక్రయించిన రైతులకు ఇప్పటి వరకు సగానికి ఎక్కువ మందికి బోనస్ రూ.500 జమకాలేదు. కొద్ది మందికి అది కూడా అరకొరగానే బోనస్ జమ చేశారు. నెల రోజుల క్రితం సన్న వడ్లను విక్రయించిన రైతులకు ఇప్పటి వరకు బోనస్ రాకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బోనస్ వస్తుందని సన్న వడ్లను సాగు చేశామని రైతులు చెబుతున్నారు. బోనస్ తప్పక జమ చేస్తామని ఇటీవల నిర్వహించిన రైతు మహోత్సవంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. కానీ ఇప్పటివరకూ బోనస్ అందలేదు. ఇక రైతు భరోసాను ఏప్రిల్ నెలాఖరులో పూర్తి చేస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పిన మాటలు నేటికీ అమలు కాలేదు.
రుణమాఫీ అమలైందంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు అనేక వేదికలపై ప్రగల్భాలు పలుకుతున్నారు. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో సగం మందికి పైగా రైతులకు పంట రుణాల మాఫీ వర్తించలేదు. రైతులంతా సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో..మిస్ వరల్డ్ పోటీల పేరుతో ప్రజా ప్రతినిధులంతా కాలక్షేపం చేయడం దేనికి సంకేతమని రైతులు ప్రశ్నిస్తున్నారు. తమ బాధలను పట్టించుకోకుండా అందాల పోటీలకే నేతలు ప్రాముఖ్యత ఇవ్వడం సబబు కాదంటున్నారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అన్నదాత కన్నా అందాల పోటీలే ముఖ్యమా…?
ఉమ్మడి జిల్లాలో యాసంగి వరి కోతలు పూర్తయ్యాయి. వడ్ల రాసులు కుప్పలు తెప్పలుగా రోడ్లపై పోసి పెట్టుకున్నారు. కొనే వారు లేకపోవడంతో అకాల వాన నుంచి పంట ఉత్పత్తులను కాపాడుకునేందుకు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. అకాలవర్షానికి తడిసిన ధాన్యాన్ని ఎండ బెట్టుకోవడం కత్తిమీద సాములా మారింది.
తడిసిన ధాన్యాన్ని కొనేందుకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ముందుకు రావడం లేదు. కొనుగోళ్లలో జాప్యం వల్లే నష్టాలు వస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. రోజుల తరబడి నిరీక్షించి వడ్లను విక్రయించినా, బస్తాలను తరలించేందుకు లారీలు సకాలంలో రావడం లేదు. ఒకవేళ వచ్చినా రైస్ మిల్లుల వద్ద అన్‌లోడింగ్‌లో జాప్యం నెలకొంటున్నది. నిజామాబాద్ రూరల్ మండలంలో కొంత మంది రైస్‌మిల్లర్లు ధాన్యం బస్తాలను అన్లోడింగ్ కోసం 5కిలోల తరుగు కోసం రైతులను వేధించారు.
ఒప్పుకోకుంటే ఓటీపీ రాదంటూ బెదిరించడంతో రైతులు ఒప్పుకోవాల్సి వచ్చింది. ధాన్యం విక్రయించడంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారు. మరోవైపు ఉమ్మడి జిల్లాకు ప్రాతినిధ్యం వహించే కొందరు ప్రజాప్రతినిధులు శనివారం సాయంత్రం ప్రారంభమైన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్నారు. సదరు నేతలు ఈ సీజన్లో ఏ ఒక్కరోజూ రైతుల కష్టాలపై కలెక్టర్లతో మాట్లాడడం, యంత్రాంగంతో సమీక్షించకపోవడం విడ్డూరం.
రైతులను ఎందుకు పట్టించుకోవడంలేదు?
రాష్ట్ర ప్రభుత్వానికి అందాల పోటీపై ఉన్న శ్రద్ధ రైతులపై ఎందుకులేదు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోతుంటే అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒక వైపు దేశ సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అన్ని కార్యక్రమాలు రద్దు చేస్తుంటే అందాల పోటీలను మాత్రం రద్దు చేయలేదు. రైతుల వడ్లు కొనకపోవడంతో వర్షానికి తడిసి ముద్దవుతున్నాయి.
– రమేశ్‌బాబు, సీపీఐ కార్యదర్శి
అందాల పోటీలు అవసరమా?
రైతులను ఇబ్బందులు పెడుతూ అందాల పోటీలు నిర్వహించడం అవసరమా?
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా చేయక రైతులు పడిగాపులు కాస్తున్నారు. అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. వారి సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నది.
– విజయలక్ష్మి ,బీఆర్ఎస్కే జిల్లా కార్యదర్శి