ఖలీల్‌వాడి, ఏప్రిల్ 24: జిల్లాలో కొన్ని ప్రైవేట్ కళాశాలు ప్రభుత్వ నిబంధనలను తుంగలోకి తొక్కుతున్నాయి. విద్యాశాఖ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాయి. ఇంటర్ కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సెలవుల అనంతరం జూన్‌లో తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ జిల్లాలోని కొన్ని ప్రైవేట్ కళాశాలలు మాత్రం సెకండియర్ విద్యార్థులకు వేసవి సెలవుల్లోనూ తరగతులు నిర్వహిస్తూ, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే ఎండలు తీవ్ర స్థాయిలో ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిరోజులుగా జిల్లాలో 44 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండ బారిన పడకుండాతగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌తోపాటు వైద్యారోగ్య శాఖ అధికారులు, డాక్టర్లు సూచిస్తున్నారు.
మరోవైపు ప్రైవేటు కళాశాలలు మాత్రం తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతినేలా చేస్తున్నాయి. దీంతో వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మండుతున్న ఎండల్లో తరగతులు నిర్వహిస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన చెందుతున్నారు. పైవేటు కాలేజీలు తరగతులు నిర్వహిస్తున్నా, సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాలేజీల్లో కనీస వసతులు కరువైనా అధికారులు పట్టించు కోవడం లేదు. తరగతి గదుల్లో ఫ్యాన్లు లేకున్నా.. కళాశాలలో పార్కింగ్ స్థలం లేకున్నా యాజమాన్యాలను ప్రశ్నించే వారు లేకుండా పోయారు.
ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరుచేయడమేకాకుండా, ఎండలు దంచికొడుతున్నా తరగతులు నిర్వహిస్తుండడంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. దీనిపై ఇంటర్ విద్యాశాఖ అధికారి ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి ప్రైవేట్ కళాశాలలో వసతులను తనిఖీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వేసవి సెలవుల్లో తరగతులపై ఇంటర్ జిల్లా అధికారికి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయకపోవడం గమనార్హం.
విద్యాశాఖ నిబంధలను పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ కళాశాలలను తనిఖీ చేసేవారే కరువయ్యారు. ప్రభుత్వ కళాశాలల్లో తనిఖిలు నిర్వహిస్తున్న అధికారులు.. ప్రైవేటు కాలేజీల్లోనూ నిర్వహిస్తే వాస్తవాలు వెలుగుచూసే అవకాశాలు ఉంటాయని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. జూన్‌లో ప్రారంభించాల్సిన ద్వితీయ సంవత్సరం తరగతులు ఇప్పటి నుంచే నిర్వహిస్తున్నారు.
ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. జూన్‌లో తరగతులు ప్రారంభించాల్సి ఉండాగా, ముందుస్తుగానే సెలవుల్లో నిర్వహిస్తున్నారు. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం.
– శివ, ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు