నిజామాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పేద విద్యార్థులకు సాంకేతిక విద్య అందని ద్రాక్షగా మారుతున్నది. ఉమ్మడి జిల్లాలో ఇంజినీరింగ్ చదివే విద్యార్థులకు ప్రైవేట్ కళాశాలలే శరణ్యం. ఉత్తర తెలంగాణలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు ఎంతో పేరు పొందిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్క ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల కూడా లేకపోవడం గమనార్హం. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది.
దీనిపై కేసీఆర్ అధికారికంగా వెల్లడించే క్రమంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ సైతం ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుపై స్పష్టమైన హామీ ఇచ్చింది. లోక్సభ ఎన్నికల సమయంలో పాత కలెక్టరేట్ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావించగా.. సీఎం రేవంత్ రెడ్డి సైతం సుముఖత వ్యక్తం చేశారు. కానీ అధికారంలోకి వచ్చినా ఇంత వరకూ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు ప్రక్రియపై అతీగతీ లేకుండా పోయింది.
ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు ఎంసెట్ రాసిన తర్వాత ఇతరత్రా జిల్లాలకు పయనమవుతున్నారు.మంచి ర్యాంకులు వచ్చినా ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల లేకపోవడంతో గత్యంతరంలేక ప్రైవేటు కళాశాలలను ఎంపిక చేసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో మూడు ఇంజినీరింగ్ కళాశాలలు ప్రైవేటులోనే కొనసాగుతుండగా.. కామారెడ్డిలో ఒకటి ఉండగా దానిని మూసివేశారు. ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని విద్యార్థి లోకం డిమాండ్ చేస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్రెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు. ఎమ్మెల్యేగా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి ఇంజినీరింగ్ కళాశాలను తొలుత మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో పలు జిల్లాల్లో ఇంజినీరింగ్ కాలేజీ స్థాపనపైనా ప్రకటన చేశారు. ఇందులో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కాలేజీ సైతం ఉన్నది. ఇప్పుడిక్కడ పదో తరగతి అనంతరం పాలిసెట్ తర్వాత మూడేండ్ల డిప్లొమా కోర్సుల్లో విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్యను అందిస్తున్నారు. ఇదంతా ప్రాథమిక స్థాయిలోనే జరిగే విద్యా బోధన కావడంతో పాలిటెక్నిక్లోనే ఇంజినీరింగ్ ఉన్నతీకరణ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
పాలిటెక్నిక్ కాలేజీలో విద్యాభ్యాసం ముగిసిన తర్వాత డిప్లొమా విద్యార్థులంతా తిరిగి ఈ-సెట్ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. తద్వారా తిరిగి ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగేండ్ల కోర్సులో నేరుగా రెండో సంవత్సరంలో చేరాల్సి ఉంటుంది. పాలిటెక్నిక్ ఉన్నతీకరణ చేయడం ద్వా రా ఎంసెట్ ద్వారా ఇంజినీరింగ్ కోర్సుల్లోకి వచ్చే వారికి లాభం జరుగుతుందా? లేదా? అనే దానిపై స్పష్టత లేదు. మరోవైపు ప్రస్తుతం నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో సరిపడా స్థలం లేదు. ప్రస్తుతం ఉన్న ఖాళీ స్థలాన్ని నగరవాసుల అవసరాలు, పలు క్రీడలకు వినియోగిస్తున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల లేకపోవడం అన్నది ఈ ప్రాంత విద్యార్థులకు ఇబ్బందికరమైన పరిస్థితినే తెలియజేస్తోంది. చాలా మంది నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి ఇంజనీరింగ్ విద్య అందని ద్రాక్షలా మారుతోంది. ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకునేంత స్తోమత లేని పేద కుటుంబాలకు తీరని అన్యాయం జరుగుతోంది.
– సునీల్, ఏబీవీపీ కన్వీనర్, నిజామాబాద్ జిల్లా
తెలంగాణ యూనివర్సిటీని 2006లో ప్రారంభించగా..మొదట ఆరు కోర్సులు ప్రవేశపెట్టారు. డిచ్పల్లికి క్యాంపస్ మారిన తర్వాత సువిశాలమైన ప్రాంతంలో కొత్త కోర్సులు వచ్చి చేరాయి. 2019-20 విద్యా సంవత్సరానికి మొత్తం 31 కోర్సులతో వేలాది మందికి వర్సిటీ విద్యను అందిస్తున్నది. అత్యుత్తమమైన ప్రమాణాలతో ఇక్కడ విద్యాభ్యాసం కొనసాగుతున్నది.
టీయూ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మధ్య సమన్వయంలోపం ఉన్నప్పటికీ పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన చదువు ఇక్కడ అందుతున్నది. డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి, నడిపల్లి గ్రామ శివారులో మొత్తం 577 ఎకరాల్లో తెలంగాణ యూనివర్సిటీ నెలకొని ఉన్నది. వర్సిటీ విస్తరణ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తే పేద విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది.
అదే సమయంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలంతా ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు. కానీ అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలోనైనా ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు అడుగు ముందుకు పడాలని ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యార్థులు కోరుకుంటున్నారు. టీయూలో ఉన్న భూ లభ్యతతోపాటు రైల్వే, జాతీయ రహదారి -44 అనుకూలతలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. దీనికి తోడుగా ఫ్యాకల్టీ, పరిపాలన సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలి. ఎన్నికల్లో ప్రకటనలు చేసినంత వేగం గా ఈ అంశంపై ముందడుగు పడకపోవడం బాధాకరం. ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడానికి మన ప్రాంతంలో అనేక అనుకూలతలు ఉన్నాయి.
– శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్వీ నాయకుడు