ఖలీల్‌వాడి/ కామారెడ్డి, జూన్ 12: వేసవి సెలవులు ముగియడంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు బుధవారం పునఃప్రారంభమయ్యాయి. తొలిరోజు అంతంత మాత్రంగానే విద్యార్థులు హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 89,764 మంది, ప్రైవేటు పాఠశాలల్లో 1,55,044 మంది విద్యార్థులుండగా మొదటి రోజు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 86వేల మంది చదువుతుండగా, 60వేల మంది మాత్రమే హాజరైనట్లు సమాచారం. కొన్ని ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు అసలే రాలేదని తెలుస్తుంది. మరోవైపు మొదటిరోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు సమస్యలే స్వాగతం పలికాయి. అమ్మ ఆదర్శ పాఠశాల పనులు నత్తనడకన సాగుతుండడంతో నిర్మాణ సామగ్రి ఎక్కడపడితే అక్కడే పడేశారు. కొన్ని పాఠశాలల్లో తరగతి గదులను కూడా శుభ్రపరచలేదు. విద్యార్థులే బెంచీలను మోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాఠశాలలు అస్తవ్యస్తంగా ఉండడంతో విద్యార్థులు చదువుకోవడానికి, ఆడుకోవడానికి ఇబ్బందులుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమం చేపట్టినప్పటికీ స్పందన కనిపించలేదు. కొంతమంది ఉపాధ్యాయులు బదిలీలు, ఉద్యోగోన్నతుల బిజీలో ఉండడంతో పాఠశాలకు డుమ్మాకొట్టినట్లు సమాచారం.
తక్కువ సంఖ్యలో విద్యార్థులు
నిజామాబాద్ నగరంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. అంబేద్కర్ కాలనీలోని హరిజవాడ ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు రాలేదు. హమాల్‌వాడీ పాఠశాలలో కేవలం ఐదుగురు మాత్రమే హాజరయ్యారు. రాజీవ్నగర్కాలనీలోని పాఠశాలకు 20 మంది విద్యార్థులు వచ్చారు. ఆదర్శనగర్ పాఠశాలలో అమ్మ ఆదర్శ పనులు పూర్తికాకపోవడంతో విద్యార్థులను మహిళా భవన్లో ఉంచి బోధిస్తున్నారు. పోలీస్ లైన్ పాఠశాలలో పనులు అసంపూర్తిగా ఉండడంతో ఉదయం ప్రైమరీ, మధ్యాహ్నం హైస్కూల్‌ను నిర్వహించారు.
విద్యా వ్యాపారంలో ప్రైవేటు సక్సెస్..
ప్రైవేటు పాఠశాలల్లో విద్యా వ్యాపారం సక్సెస్ ఫుల్‌గా కొనసాగుతున్నది. పుస్తకాలు,యూనిఫామ్స్, నోట్‌బుక్స్, టై, బెల్టు, స్పోర్ట్స్ డ్రెస్ తదితర వాటి పేరిట వ్యాపారం నిర్వహిస్తున్నారు. పుస్తకాలు కొనుగోలు చేయని తల్లిదండ్రుల ఫోన్లకు పాఠశాలల నుంచి మెస్సేజ్‌లు వస్తున్నాయి. ఇదంతా తెలిసినా విద్యాశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం. కొన్ని పాఠశాలలు ఎవరికీ చిక్కకుం డా వ్యాపారం కొనసాగిస్తున్నాయి. పాఠశాలకు సమీపంలోనే ఓ దుకా ణం ఏర్పాటు చేసి అందులో సిబ్బందితో పుస్తకాలు, యూనిఫామ్స్ విక్రయిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున వ్యాపారం నిర్వహిస్తున్నా విద్యాశాఖ అధికారులకు తెలియడం లేదా? తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తేనే స్పందిస్తారా? సంబంధిత శాఖకు స్వయం అధికారాలు లేవా? లేకపోతే ప్రైవేటు విద్యాసంస్థలు ఇచ్చే అమ్యామ్యాలకు తలొగ్గి సైలెంట్‌గా ఉంటున్నారా అని పలువురు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
చెత్తగా మారిన బడులు..
పాఠశాలల పునఃప్రారంభం విషయం తెలిసినా అధికారుల, ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతో కొన్ని పాఠశాలలు చెత్తాచెదారంతో దర్శనమిచ్చాయి. రెండురోజుల ముందుగానే బడిని అందంగా ముస్తాబు చేయాల్సి ఉన్నా.. పట్టింపులేని తనంతో అస్తవ్యస్తంగా మారాయి. కొన్ని పాఠశాలల్లో మరమ్మతు పనులు కొనసాగుతుండడంతో పాఠశాల ఆవరణ, తరగతి గదులు విద్యార్థులు కూర్చుండేందుకు వీలు లేకుండా తయారయ్యాయి. మరికొన్ని చోట్ల మరుగుదొడ్లు, తాగునీటి సమస్యలు నెలకొన్నాయి.
బ్రేక్‌ఫాస్ట్‌కు..బ్రేక్
గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన బ్రేక్‌ఫాస్ట్ పథకం పాఠశాలల పునఃప్రారంభం రోజున కనిపించలేదు. ఉదయం ఖాళీ కడుపుతో విద్యార్థులు తరగతులకు హాజరుకావొద్దనే ఉద్దేశంతో కేసీఆర్ హయాంలో ఈ పథకాన్ని ప్రారంభించింది. కానీ కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఆ పథకం అమలును మరిచిపోయినట్లు తెలుస్తున్నది.