గాంధారి, ఆగస్టు 28: కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని గౌరారం గ్రామస్తులు అడవుల సంరక్షణకు కదిలారు. ఆడవులను ఆక్రమించి వేసిన గుడిసెలను ఇటీవలే ధ్వంసం చేసిన స్థానికులు.. తాజాగా అటవీ భూము ల్లో సాగు చేసిన పంటల్లోకి బుధవా రం పశువులను వదిలారు. చెట్లను అక్రమంగా నరికేస్తుండడంతో అడవి కనుమరుగై పోతుందని గ్రహించిన గ్రామస్తులు.. పచ్చదనం పెంపొందించడానికి నడుం బిగించారు.
అందులో భాగంగానే బుధవారం అటవీ శాఖ అధికారులతో కలిసి తమ గ్రామ శివారులోని అటవి భూముల్లో ఆక్రమంగా సాగు చేస్తున్న పంటల్లోకి పశువులను వదిలారు. చుట్టు పక్కల తండా వాసులు అత్యాశకు పోయి తమ గ్రామ శివారులోని అటవీ భూముల్లో పంటలను సాగు చేస్తున్నారని, తద్వారా అడవి కనుమరుగై పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో అటవీ జంతువులకు ఆవాసాలు లేక ఊర్లల్లోకి వస్తున్నాయన్నారు. అటవీ భూములను ఆక్రమించిన వారిపై కేసులు పెట్టి, కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు అధికారులను కోరారు. భావి తరాలను దృష్టిలో ఉంచుకొని అడువులు అంతరించి పోకుండా కృషి చేస్తున్న గౌరారం గ్రామస్తులను ఇతరులు ఆదర్శంగా తీసుకుని అడవుల పరిరక్షణకు ముందుకు రావాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు.