రెంజల్,ఆగస్టు 27 : నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని కందకుర్తి వద్ద గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలను నిజాంసాగర్ రెండువేల క్యూసెక్కుల నీటిని బుధవారం రాత్రి విడుదల చేయడంతో గురువారం ఉదయం నుండి గోదావరి వరద ప్రభావం మరింత వేగంగా పెరుగుతుంది.
గోదావరి నదిపై నిర్మించిన హై లెవెల్ వంతెనను తాకుతూ వరద ప్రభావం కొనసాగుతుంది. నదిలోని పుష్కర ఘాట్లు పూర్తిగా నీట మునిగాయి. అంతరాష్ట్ర సరిహద్దులోని వరద ప్రభావం వేగంగా పెరగడంతో రెంజల్ పోలీసులు ధర్మాబాద్ వైపు వాహనాల రాకపోకలను నిలిపి వేస్తూ ఆంక్షలు విధించారు. రోడ్డుకు భారీకేట్లను ఏర్పాటు చేశారు. ప్రమాదవశాత్తు ఎలాంటి సంఘటనలు జరగకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు రెండు డోజర్లను ఏర్పాటు చేసినట్టు రెంజల్ ఎస్ఐ కే.చంద్రమోహన్ తెలిపారు. నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.