రెంజల్, సెప్టెంబర్ 16 : నిజామాబాద్ జిల్లా రెంజర్ల మండలంలోని కందకుర్తి గ్రామ శివారులో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. పొరుగున గల మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు, వాగులు, పొంగిపొర్లుతున్నాయి. పెద్ద మొత్తంలో నీరు గోదావరి నదిలోకి ప్రవేశిస్తుంది.
మూడు నదులైన హరిద్ర, మంజీరా, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తెలంగాణ -మహారాష్ట్ర సరిహద్దులోని కందకుర్తి గోదావరి నదిపై నిర్మించిన వంతెనకు తాకుతూ వరద నీటి ప్రవాహం వేగంగా పెరుగుతుంది. గోదావరి నదికి వెళ్లే విఐపి పుష్కర ఘాట్ రోడ్డు మార్గం పూర్తిగా నీట మునిగింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు నది ప్రాంతాలకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.