రామారెడ్డి, ఆగస్టు 24: విష జ్వరాలు పంజా విసురుతున్నాయి. ఒకే గ్రామం లో పది రోజుల్లో ఇద్దరు చిన్నారులు మరణించిన ఘటన కలకలం రేపుతున్నది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో పది రోజుల క్రితం విషజ్వరంతో ఊరడి రంజిత్(9) విద్యార్థి మరణించాడు. ఆ ఘటన మరువక ముందే తాజాగా శనివారం అదే గ్రామానికి చెందిన మరో బాలిక మగ్గం మాన్యశ్రీ (12) మృతి చెందింది.
భూంపల్లికి చెందిన శోభదిలీప్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. తల్లి శోభ గ్రామంలో ఆశ కార్యకర్తగా పనిచేస్తున్నది. చిన్న కూతురు మాన్యశ్రీ రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా కామారెడ్డిలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యుల సూచన మేరకు శనివారం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందింది. పది రోజుల్లో విషజ్వరంతో ఇద్దరు పిల్లలు మరణించడంతో గ్రామస్తులు భయాందోళన వ్యక్తంచేస్తున్నారు.