భీమ్‌గల్, నవంబర్ 13 : శ్రీమన్నింబాచల లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు. గోవింద నామ స్మరణతో నింబాచల గిరులు మార్మోగాయి. వేలాదిగా తరలివచ్చిన మహిళలు భక్తిశ్రద్ధలతో లింబాద్రిగుట్ట ప్రదక్షిణ పూర్తిచేశారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేద పండితులు బుధవారం ఏకాక్షర నృసింహ హోమాన్ని శాస్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామి వారి ఉత్సవ విగ్రహాలతో గిరి ప్రదక్షణ చేశారు. అందంగా అలంకరించిన పల్లకీలో ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. గతంలో రాళ్లు, రప్పలతో కూడిన మార్గంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి రూ.70 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు వేయడంతో గిరి ప్రదక్షిణకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది.
ఖలీల్‌వాడి, నవంబర్ 13: ఉత్తర తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన లింబాద్రిగుట్ట శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపనున్నది. భక్తుల అవసరాలకు అనుగుణంగా ఆర్మూర్, నిజామాబాద్, ధర్పల్లి, సిరికొండ నుంచి లింబాద్రిగుట్టకు శుక్రవారం నుంచి నాలుగు రోజులపాటు ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఆర్ఎం జానీరెడ్డి తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని, లక్ష్మీనర్సింహస్వామి ఆశీస్సులు పొంది.. సుఖవంతమైన ప్రయాణంతో వారి గమ్యస్థానాలకు చేరాలన్నారు.