Thefts arrested | వినాయక నగర్,జూన్03: నిజామాబాద్ జిల్లాతో పాటు హైదరాబాద్ జిల్లాలలో వరుస చోరీలకు పాల్పడిన అంతర్ జిల్లాల ఘరానా ముఠా సభ్యులను నిజామాబాద్ పోలీసుల అరెస్టు చేశారు. గత కొంతకాలంగా తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకొని వరుస దోపిడీలకు పాల్పడుతున్న ముఠాకు చెందిన 8 మంది సభ్యులను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన మమ్మద్ ఆమేర్ అనే పాత నేరస్థుడు నిజామాబాద్ జిల్లాకు చెందిన 8 మంది సభ్యులన తన ముఠాలో చేర్చుకొని ఘరానా దొంగల గ్యాంగ్ ను తయారు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఈ అంతర్ జిల్లాల దొంగల ముఠాకు సంబంధించిన వివరాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం కమిషనరేట్ లోని కమాండ్ కంట్రోల్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిజామాబాద్ ఏసీబీ రాజా వెంకట్ రెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నట్లు సిపి తెలిపారు.మొత్తం ఎనిమిది మంది సభ్యులు గల ఈ ముఠా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐదు, ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ లతోపాటు హైదరాబాద్ శివారు ప్రాంతాలలో సైతం మొత్తం 39 దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా తన ముఠా లో ఉన్న సభ్యులైన మిగతా వారి వివరాలు వెల్లడించినట్లు తెలిపారు.
పాత నేరస్తుడు ఇచ్చిన సమాచారం మేరకు నిందితులైన మహమ్మద్ అబ్దుల్ ఆసిఫ్, వసీం, సోహెల్, జావిద్ ఖాన్, రియాజ్, అలీ, ఆసిఫ్ ఖాన్ ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సిపి సాయి చైతన్య తెలిపారు. నిందితుల వద్ద నుండి 15 తులాల బంగారు నగలతో పాటు నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ముఠాలు పట్టుకునేందుకు నిజామాబాద్ సౌత్ రూరల్ సిఐ సురేష్ కుమార్ తో పాటు ఆరవటౌన్ ఎస్సై వెంకట్ సిబ్బంది తీవ్రంగా కృషి చేశారని ఈ సందర్భంగా వారికి రివార్డులను అందజేశారు. ఈ ముఠాకు చెందిన మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.