ఆర్మూర్ టౌన్, జూన్ 25: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో నిర్లక్ష్యం తాండవిస్తున్నది. వైద్యం కోసం వచ్చే వారిని పట్టించుకునే వారే కరువయ్యారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ గ్రామానికి చెందిన బుజ్జమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతుడడంతో 108 అంబులెన్స్ సిబ్బంది ఆమెను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన (జీజీహెచ్)కు తరలించారు. అయితే జీజీహెచ్‌లో వృద్ధురాలిని దవాఖాన వర్గాలు పట్టించుకోలేదు. సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో ఈ విషయాన్ని కొందరు ఫోన్ ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే స్పందించిన కలెక్టర్ వృద్ధురాలు బుజ్జమ్మకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జీజీహెచ్ అధికారులను ఆదేశించారు. అయితే సొంతూరు పెర్కిట్‌కు దగ్గరగా ఉన్న ఆర్మూర్‌లో చికిత్స చేయించుకుంటానని బుజ్జమ్మ చెప్పడంతో వృద్ధురాలిని ఆర్మూర్ ఏరియా దవాఖానకు తరలించారు. బుధవారం ఆమెను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పరామర్శించారు. ఆమె అరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఆమె కాలికి గాయం కావడంతో మెరుగైన వైద్య సేవలు అవసరమని డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.
దీంతో బుజ్జమ్మను జీజీహెచ్‌కు తరలించాలని, పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన వైద్యం అందించాలని,అవసరమైతే హైదరాబాద్‌కు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఆర్మూర్ దవాఖానలో వైద్యులతో కలెక్టర్ మాట్లాడారు. సమయపాలన పాటించాలని, పరిసరాలు శుభ్రంగా ఉంచాలని, దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట డాక్టర్లు అమృత్ రాంరెడ్డి, రవి కుమార్, వైద్య సిబ్బంది, అధికారులు ఉన్నారు.